కోయంబత్తూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (టీవీకే) పార్టీ కోయంబత్తూరులో మంగళవారం రోబోను ఉపయోగించి వినూత్నంగా ప్రచారం నిర్వహించింది.
కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం ఆ పార్టీ అభ్యర్థి వి.సెంథిల్ కుమార్ ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ రంగులతో కూడిన కండువాను ధరించి, పార్టీ గుర్తు 'విజిల్'ను మెడలో వేసుకున్న హ్యూమనాయిడ్ రోబో, అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొంది. ఈ సందర్భంగా రోబో ప్రజలకు అభివాదం చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకుంది. ఈ రోబోను చూసేందుకు ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సెల్ఫీలు తీసుకున్నారు.

