టీవీకే 180 నుంచి 200 సీట్లు గెలుస్తది.. విజయ్ CM అవ్వడం పక్కా: కేఏ సెంగోట్టయ్యన్

టీవీకే 180 నుంచి 200 సీట్లు గెలుస్తది.. విజయ్ CM అవ్వడం పక్కా: కేఏ సెంగోట్టయ్యన్

చెన్నై: ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ జోష్‎లో ఉంది. మై యాక్సిస్ ఇండియా వంటి క్రెడిబుల్ సంస్థ టీవీకే పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని అంచనా వేయడం తమిళనాడుతో పాటు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో టీవీకే కార్యనిర్వహణా కమిటీ ముఖ్య సమన్వయకర్త కేఏ సెంగోట్టయ్యన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం (మే 2) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే 180 నుంచి 200 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

విజయ్ సీఎం అవ్వడం పక్కా అని జోస్యం చెప్పారు. విజయ్ విజన్ ఉన్న నాయకుడు అని.. దూరదృష్టితో అతడు తమిళనాడును పాలిస్తాడని అన్నారు. విజయ్ ఎన్నో పరీక్షలు, సవాళ్లను ఎదుర్కొని రాత్రింబవళ్లు కష్టపడ్డాడని తెలిపారు. ఎన్నికల ముందు విజయ్ పై వచ్చిన ఆరోపణలు, విమర్శలకు మే 4న కాలమే సమాధానం చెబుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫలితాల తర్వాత అన్నాడీఎంకే, బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకునే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు.

 కాగా, తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మే 4న కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని మెజార్టీ ఎగ్జిట్స్ పోల్స్ అంచనా వేశాయి. అన్నాడీఎంకే, బీజేపీ కూటమి మరోసారి ప్రతిపక్షానికి పరిమితం అవుతోందని వెల్లడించాయి. 

అయితే, యాక్సిస్ మై ఇండియా, టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. తమిళనాడులో టీవీకే కింగ్‌మేకర్‌గా అవతరించే అవకాశం ఉందని ఈ రెండు సంస్థలు అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్స్ పోల్స్ ప్రకారం టీవీకే 98 నుంచి 120 నియోజకవర్గాల్లో గెలుస్తుందని అంచనా వేయగా.. టుడేస్ చాణక్య సుమారు 63 సీట్లు దక్కించుకోవచ్చని పేర్కొంది.