- ఐఅండ్పీఆర్కమిషనర్కు టీడబ్ల్యూజేఎఫ్వినతి
హైదరాబాద్ సిటీ, వెలుగు: జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఐఅండ్ పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డిని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఫెడరేషన్ లీడర్లు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలన్నారు. రెండేండ్లుగా ప్రభుత్వ ప్రకటనల బిల్లులు ఇవ్వకపోగా, పీరియాడికల్స్ కు ప్రభుత్వం ఇచ్చే యాడ్స్ పూర్తిగా నిలిపివేశారన్నారు. దీంతో అనేక చిన్న, మధ్య తరహా పత్రికలు, పీరియాడికల్స్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ పర్మిషన్తో నడుస్తున్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు, అక్రెడిటేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదన్నారు. వేరే రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ ఇస్తుండగా మన రాష్ట్రంలో ఏ ఒక్క సీనియర్ జర్నలిస్టుకి పెన్షన్ ఇవ్వడం లేదన్నారు.
కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీకి జీవో 252 విడుదలై మూడు నెలలైనా ఇంత వరకు కార్డులు ఇవ్వలేదన్నారు. పాత కార్డుల గడువు ఇంకో రెండు రోజులే ఉండగా కొత్త కార్డులు ఇంకా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలివ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్ తన్నీరు శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సామ్రాట్ గుప్తా, జిల్లా కన్వీనర్ ఎం. రవికుమార్, కో-కన్వీనర్ ఆర్.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు గోవింద్, రవి కుమార్, బ్రహ్మం పాల్గొన్నారు.

