IPL 2026 సీజన్‌లో నేడు (2026, ఏప్రిల్ 28) ఒక అత్యంత ఉత్కంఠ భరితమైన పోరుకు రంగం సిద్ధమైంది. ముల్లన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. గత మ్యాచ్‌లో 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన పంజాబ్, అదే ఊపులో రాజస్థాన్‌ను కూడా చిత్తు చేయాలని చూస్తోంది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం ప్రస్తుతం బ్యాటర్లకు స్వర్గధామంగా మారింది.. ఇక్కడి పిచ్‌పై బంతి నేరుగా బ్యాట్‌లోకి వస్తుండటంతో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది.
హెడ్ టు హెడ్ రికార్డులు:
పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మొత్తం 30 మ్యాచ్‌లు జరిగాయి. రాజస్థాన్ మ్యాచులలో 17 విజయాలు సాధించగా, పంజాబ్ కేవలం 13 మ్యాచుల్లో గెలిచింది. కాగా ప్రస్తుత ఫామ్ ప్రకారం పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్స్‌గా (13 పాయింట్లు) ఫుల్ జోష్‌లో కొనసాగుతుంది.
పరుగుల పండగే:
ఈ సీజన్‌లో ఇక్కడ యావరేజ్ స్కోరు 212గా ఉంది.. ఈ గ్రౌండ్ లో బౌండరీలు చిన్నగా ఉండటంతో భారీ సిక్సర్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక్కడ 28°C నుంచి- 30°C ఉష్ణోగ్రతతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ కచ్చితంగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఏ జట్టు గెలుస్తుందంటే?:
ప్రస్తుత గణాంకాల ప్రకారం పంజాబ్ కింగ్స్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది. రాజస్థాన్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్, రవీంద్ర జడేజా లాంటి మ్యాచ్ విన్నర్లు ఉండటంతో ఈ పోరు చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. పంజాబ్ మరోసారి తమ సొంత గడ్డపై జెండా పాతాలని చూస్తుండగా, రాజస్థాన్ వరుస ఓటములకు బ్రేక్ వేయాలని కసితో ఉంది.

