అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సెలబ్రిటీ రియాలిటీ షో 'ది ట్రేటర్స్' ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను పరిచయం చేస్తోంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షోలో ప్రతి అడుగూ ఉత్కంఠే.. ప్రతి వ్యూహం వెనుక ఓ మైండ్ గేమ్ దాగి ఉంది.. ఎవరిని నమ్మాలి? ఎవరు వెన్నుపోటు పొడుస్తారు? అనే ప్రశ్నలతో ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
20 మంది సెలబ్రిటీలు ఇన్నోసెంట్స్, ట్రేటర్స్‌గా విడిపోయి ఆడుతున్న ఈ గేమ్‌లో టాస్కులు, అనుమానాలు, రహస్య ఎలిమినేషన్లు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. హోస్ట్‌గా తేజ సజ్జ తన స్టైలిష్ ప్రెజెన్స్‌తో షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
స్ట్రాంగ్ ప్లేయర్ గా వర్ధన్..
'గీతా సుబ్రహ్మణ్యం', 'హలో వరల్డ్' వంటి వెబ్ సిరీస్‌లతో రచయితగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జె.ఎస్.ఎస్. వర్ధన్.. ఇప్పుడు తన గేమ్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటూ, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ.. ముందుకెళ్తున్నారు.. చిన్మయి, నిఖిల్, గౌరవ్‌ల ఎలిమినేషన్ల తర్వాత అనుమానాలను కొత్త కోణంలో పరిశీలించిన వర్ధన్, విద్యులేఖపై సందేహాలను బలంగా వినిపించారు. ఆమె ఎలిమినేషన్‌లోనూ కీలక పాత్ర పోషించారు. మరోవైపు రాహత్ వ్యూహాలను విశ్లేషించి, మోనిషాను తనవైపు తిప్పుకునే ప్రయత్నం వెనుక ఉన్న గేమ్ ప్లాన్‌ను ఇతరులకు వివరించడం ఆయన పరిశీలనా శక్తికి నిదర్శనం.
ఊహించని ఎలిమినేషన్
వర్ధన్ బయటకు వెళ్లిపోతాడని చాలామంది భావించిన సమయంలో రాహత్ ఎలిమినేషన్‌తో గేమ్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇక ఆరో ఎపిసోడ్ చివర్లో హర్ష వర్ధన్, ఎస్.ఎస్. వర్ధన్‌ను ట్రేటర్‌గా అనుమానించడం మరో సంచలనంగా మారింది. నిజంగా వర్ధన్ ట్రేటరా? లేక బలమైన ఆటగాడిని అనుమానాల వలలో చిక్కించేందుకు జరుగుతున్న ప్రయత్నమా? 'మై డియర్ ట్రేటర్.. దమ్ముంటే ఈరోజు రాత్రి నన్ను బతికించు.. రేపు మాత్రం నేను నిన్ను చంపేస్తా' అనే సవాల్‌తో తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
ALSO READ : టైటిల్ చూస్తే ఫ్యామిలీ.. ట్రైలరేమో క్రైమ్..
ఇప్పటికే హిట్ లిస్ట్‌లో ఉన్న వర్ధన్, శ్రావ్య, ధనుంజయ్‌లకు మిషన్‌లోనూ ప్రమాదం ఎదురవడంతో తదుపరి ఎలిమినేషన్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. వర్ధన్ తన వ్యూహాలతో మరోసారి బయటపడతారా? లేక ట్రేటర్స్‌కు తదుపరి టార్గెట్ అవుతారా? ఈ మైండ్ గేమ్‌లో అసలైన విజేత ఎవరో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే..
