V6 News

భారత్‎లో డిజిటల్ అరెస్ట్ స్కామ్:  9 వేల 400 ఖాతాలను బాక్ల్ చేసిన వాట్సప్

భారత్‎లో డిజిటల్ అరెస్ట్ స్కామ్:  9 వేల 400 ఖాతాలను బాక్ల్ చేసిన వాట్సప్

న్యూఢిల్లీ: మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ఫ్లాట్‎ఫామ్ వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) సెక్యూరిటీ ఫీచర్‎ను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ ఫీచర్‎ను అడ్డుపెట్టుకుని డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. దీంతో వాట్సాప్ ద్వారా డిజిటల్ అరెస్ట్ స్కాములకు పాల్పడుతోన్న అకౌంట్లపై మెటా ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే 2026 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లకు సంబంధించిన 9,400కు పైగా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ సుప్రీంకోర్టుకు తెలిపింది. 

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంశాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని విచారిస్తోంది. విచారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరుఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సుప్రీంకోర్టుకు కీలకమైన నివేదికలు సమర్పించారు. ఈ నివేదికల ప్రకారం.. 2026 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లకు సంబంధించిన 9,400కు పైగా ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుంచి అందిన సమాచారం మేరకే తాము ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. 

ALSO READ : బెంగళూరులో దారుణం : రక్తపు మడుగులో నగ్నంగా మహిళ..

భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ అరెస్ట్ మోసాలకు పాల్పడుతోన్న చాలా ఖాతాలు ఆగ్నేయాసియాలోని ముఖ్యంగా కంబోడియా నుంచి నిర్వహించబడుతున్నాయని వెల్లడించింది. ప్రజలను భయపెట్టేందుకు సైబర్ నేరగాళ్లు ఢిల్లీ పోలీస్, ముంబై హెచ్‌క్యూ, సీబీఐ, ఏటీఎస్ డిపార్ట్‌మెంట్ వంటి పేర్లను ఉపయోగిస్తూ  ప్రొఫైల్ చిత్రాలు పెడుతున్నారని తెలిపింది. ప్రభుత్వ సూచనల మేరకు రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ స్కామ్‎లను కట్టడి చేసేందుకు  కొత్త సెక్యూరిటీ వ్యవస్థను తీసుకొచ్చినట్లు వాట్సాప్ వెల్లడించింది.