V6 News

చీటింగ్ కేసులతో ఇండస్ట్రీ షేక్: బిగ్‌బాస్ నటుడిపై కేసు నమోదు.. వ్యాపారం పేరుతో లక్షల దోపిడి?

చీటింగ్ కేసులతో ఇండస్ట్రీ షేక్: బిగ్‌బాస్ నటుడిపై కేసు నమోదు.. వ్యాపారం పేరుతో లక్షల దోపిడి?

చీటింగ్ కేసులతో సినీ ఇండస్ట్రీ కుదేలవుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో అషురెడ్డి యవ్వారం బయటకి వచ్చి చర్చనీయాంశమైంది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను నమ్మించి సుమారు రూ.9.5 కోట్లు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ యవ్వారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే మలయాళంలో ఒక చీటింగ్ కేసు నమోదైంది. తాజాగా మలయాళీ నటుడిపై ఓ మహిళ కంప్లైంట్ ఇచ్చింది. బిజినెస్ పేరుతో తనను మోసం చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ న్యూస్ మలయాళీ ఇండస్ట్రీలో వైరల్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

బిగ్ బాస్ ఫేమ్ షియాస్ కరీం:

మలయాళీ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ షియాస్ కరీంపై (Shiyas Kareem) కేసు నమోదైంది. అతని మహిళా వ్యాపార భాగస్వామి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. ‘మోసం, అసభ్య ప్రవర్తన, నేరపూరిత బెదిరింపుల’ విషయంలో పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారు. 

ఫిర్యాదు ప్రకారం,

విదేశాల్లో నివసిస్తున్న ఆ మహిళ బాధితురాలు సోషల్ మీడియా ద్వారా కరీంతో పరిచయం ఏర్పరచుకుంది. ఆ తర్వాత వ్యాపార భాగస్వామ్యంలోకి ప్రవేశించింది. అలా షియాస్ కరీం కొత్త వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తానని హామీ ఇచ్చి, లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టించుకున్నాడు. రోజులు గడుస్తున్నాయి తప్ప.. ముందు కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయడంలో కరీం విఫలమయ్యాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది. ఈ క్రమంలోనే పెట్టిన పెట్టుబడి తనకు తిరిగి ఇవ్వాలని అడగ్గా.. బెదిరించినట్లుగా బాధితురాలు ఆరోపించింది.

ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 318(4) (మోసం), సెక్షన్ 79 (మహిళ పరువుకు భంగం కలిగించడం), సెక్షన్ 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే కరీంను ప్రశ్నించనున్నట్లు పోలీసులు తెలిపారు.

జిమ్‌ ట్రైనర్‌ని వేధించి అరెస్ట్..!

గతంలోనూ కరీమ్ పై పలు కంప్లైంట్స్ వచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. కరీమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న జిమ్‌లోనే ఆ మహిళా జిమ్‌ ట్రైనర్‌ని వేధించి అరెస్ట్ అయ్యాడు. ఆ లేడీ ట్రైనర్ నుంచి రూ.11 లక్షలు అప్పుగా తీసుకున్నాడని.. డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని, తన వ్యాపారంలో భాగస్వామిని చేస్తానని చెప్పి మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. 

షియాస్ కరీం గురించి:

షియాస్ కరీం మలయాళ రియాలిటీ షో బిగ్ బాస్ మలయాళం సీజన్ 1లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా పాల్గొని గుర్తింపు పొందాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో టాప్-5లో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత టెలివిజన్ లో పలు ప్రాజెక్టులు, మోడలింగ్‌లో కొనసాగుతూ మలయాళ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించాడు.