V6 News

శ్రీవారి సన్నిధిలో బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య రెడ్డిల వివాహం.. ముహూర్తం ఎప్పుడంటే?

 శ్రీవారి సన్నిధిలో బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య రెడ్డిల వివాహం.. ముహూర్తం ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు.  గత కొంత కాలంగా శ్రీనివాస్ పెళ్లి గురించి వస్తున్న వార్తలకు తెరదించుతూ.. ఇటీవల కావ్యరెడ్డితో నిశ్చితార్థం వేడుకను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ప్రేమ జంట ఉంగరాలు మార్చుకున్నారు. ఇప్పుడు మరికొన్ని గంటల్లో మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు.

తిరుమల కొండపై కళ్యాణం

ఈ వివాహ వేడుకకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 29వ తేదీ రాత్రి 11:13 గంటలకు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల గిరులపై, శ్రీవారి సాక్షిగా వీరి వివాహం జరగనుంది. ఆడంబరాల కంటే ఆధ్యాత్మికతకు, సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ.. సనాతన ధర్మం, వైదిక పద్ధతుల ప్రకారం ఈ కళ్యాణ తంతు నిర్వహించనున్నారు. లోకనాయకుడైన వేంకటేశ్వరుని ఆశీస్సులతో, అత్యంత ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ జంట ఒక్కటి కానుంది.

డిజైనర్ వస్త్రాల ప్రత్యేకత

సాధారణంగా సినిమాల్లో స్టైలిష్‌గా కనిపించే శ్రీనివాస్, తన పెళ్లిలో మాత్రం పక్కా సంప్రదాయబద్ధంగా మెరిసిపోనున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శ్రవణ్ కుమార్ వధూవరుల కోసం ప్రత్యేకంగా వస్త్రాలను రూపొందించారు. భారతీయ క్లాసికల్ సౌందర్యానికి, ఆధునిక హంగులను అద్ది ఆయన తీర్చిదిద్దిన ఈ దుస్తులు పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

తిరుమలలో పెళ్లి కేవలం కుటుంబ సభ్యులకే పరిమితమైనప్పటికీ, మే 1వ తేదీన హైదరాబాద్ వేదికగా రిసెప్షన్ జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ దిగ్గజాలు, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ప్రస్తుతం బెల్లంకొండ కుటుంబం పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.