- ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఒక తుపాకీ, 8 రౌండ్లు, 2 ఖాళీ మ్యాగజైన్స్ స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: బిహార్ నుంచి నగరానికి తుపాకీ తెచ్చి విక్రయించడానికి యత్నించిన ఇద్దరు వ్యక్తులను శేరిలింగంపల్లి ఎస్వోటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మంగళవారం సాయంత్రం మీడియాకు వివరాలు వెల్లడించారు. బిహార్ రాష్ట్రం రోహతాస్ జిల్లాకు చెందిన వికాస్కుమార్(22), వంశరాజ్ రామ్(31)బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి దూలపల్లిలో ఉంటూ కూలీలుగా పనిచేస్తున్నారు.
సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వెపన్స్ అమ్మేందుకు సిద్ధమయ్యారు. బిహార్‌కి చెందిన కాజల్ సింగ్ నుంచి ఒక తుపాకీ కొన్నారు. రైలు మార్గం ద్వారా నగరానికి తెచ్చారు. విశ్వసనీయ సమాచారంతో శేరిలింగంపల్లి ఎస్వోటీ, పేట్‌బషీరాబాద్ పోలీసులు సోమవారం దూలపల్లిలోని వికాశ్ ఇండియన్ గోదాంపై దాడిచేశారు. వికాస్కుమార్, వంశరాజ్ రామ్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. ఒక 7.65 ఎం.ఎం. పిస్టల్, 8 బులెట్లు, 2 ఖాళీ మ్యాగజైన్లు దొరికాయి.
వాటిని స్వాధీనం చేసుకుని ఆర్మ్‌యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్వోటీ అడిషన్ డీసీపీ శోభన్‌కుమార్, అడిషనల్ డీసీపీ గోవర్థన్, ఏసీపీ శంకర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ ఇన్స్పెక్టర్ విజయ వర్ధన్ తదితరులు ఉన్నారు.

