- తమ్ముడు, గర్భిణి అయిన అతడి భార్యను హత్య చేసిన అన్న
- హైదరాబాద్ పాతబస్తీలో దారుణం
ఓల్డ్ సిటీ, వెలుగు : రూ. 7 వేల కోసం ఓ వ్యక్తి తన తమ్ముడు, నాలుగు నెలల గర్భిణి అయిన అతడి భార్యను హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పురలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తాన్‌పురకు చెందిన ఆదిల్‌ఖాన్ అనే వ్యక్తి తన తమ్ముడు అఖ్వీల్‌ఖాన్ (38)కు గతంలో రూ. 7 వేలు ఇచ్చాడు. సోమవారం సాయంత్రం ఆదిల్ తన తమ్ముడి ఇంటికి వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు.
రెండు రోజుల్లో డబ్బులు ఇస్తానని అఖ్విల్‌ఖాన్ చెప్పినప్పటికీ ఆదిల్ వినకపోవడంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆదిల్ కత్తితో తమ్ముడు అఖ్విల్‌ఖాన్‌తో పాటు అతడి భార్య, నాలుగు నెలల గర్భిణి అయిన అజ్మేరీబేగం (35)పై దాడి చేశాడు. గొంతు, కడుపులో విచక్షణారహితంగా పొడవడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం ఆదిల్ అక్కడి నుంచి పరార్ అయ్యాడు.
విషయం తెలుసుకున్న శంషాబాద్ డీసీపీ రాజేశ్, మీర్‌చౌక్ ఏసీపీ శ్యాంసుందర్, పోలీసులు, క్లూస్‌టీమ్ ఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. నిందితుడి కోసం ప్రత్యేక టీమ్స్‌తో గాలిస్తున్నట్లు ఏసీపీ శ్యాంసుందర్ తెలిపారు. ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ ఘటనాస్థలానికి చేరుకొని మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు.

