V6 News

యూరప్ దేశాల్లో జాబ్స్ పేరిట మోసం..ముఠాలోని ఇద్దరు అరెస్ట్

యూరప్ దేశాల్లో జాబ్స్ పేరిట మోసం..ముఠాలోని ఇద్దరు అరెస్ట్
  • పరారీలో మరో 8 మంది

జూబ్లీహిల్స్,  వెలుగు: విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ‘ట్రివియల్ చాప్టర్’ సంస్థ మోసాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేశారు. ఇన్​స్టాగ్రామ్, ఫేస్​బుక్​ ద్వారా యూరప్ దేశాలైన గ్రీస్, రొమేనియా, ఇటలీ వంటి దేశాల్లో ఉద్యోగాలంటూ ప్రచారం చేస్తూ, ఒక్కో బాధితుడి నుంచి రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేశారు. అనంతరం నకిలీ ఆఫర్ లెటర్లు ఇచ్చి ఈ ముఠా చేతులెత్తేసింది.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సంస్థ వైస్ ప్రెసిడెంట్ లంక నిరుపమ, రీజినల్ మేనేజర్ మామిడి అరుణ్ రాజ్​ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 8 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. గతంలో కూడా ఈ గ్యాంగ్ కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు రికార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు eMigrate పోర్టల్ లో నమోదు చేసుకున్న లైసెన్సుడు ఏజెంట్లను మాత్రమే సంప్రదించాలని సూచించారు.