
- జనగాం కేంద్రంగా క్రిప్టో కాయిన్ చీటింగ్
- ప్రధాన నిందితులను గతంలోనే అరెస్ట్ చేసిన ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు : జీబీఆర్ క్రిప్టో కాయిన్ మోసం కేసులో మరో ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. జనగాం జిల్లాకు చెందిన కొర్రిమెల రమేశ్‌గౌడ్ జీబీఆర్ క్రిప్టో కాయిన్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తానని ఆశచూపి 1,200 నుంచి 1,400 మంది వద్ద సుమారు రూ.95 కోట్లు సేకరించాడు. ఈ కేసులో కొర్రిమెల రమేశ్‌గౌడ్ అతడి భార్య ఉమారాణి సహా సురేశ్‌కుమార్, వైఎస్. రవికుమార్‌రెడ్డిని గతంలోనే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే కేసులో 11, 12 వ నిందితులుగా ఉన్న సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన కొడవటికంటి సుధాకర్, వనస్థలిపురానికి చెందిన కర్నాటి రమేశ్‌రెడ్డిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని సీఐడీ డీజీ శిఖాగోయల్ తెలిపారు.