భారత్కు త్వరలో మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు

భారత్కు త్వరలో మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్లు
  • హార్మూజ్ ద్వారా నేడో, రేపో బయల్దేరే అవకాశం
  • ప్రస్తుతం షార్జా తీరంలో పైన్ గ్యాస్, జగ్ వసంత్ ఎల్పీజీ క్యారియర్లు

న్యూఢిల్లీ: భారత్​కు చెందిన మరో రెండు లిక్విఫైడ్  పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ట్యాంకర్లు తిరిగి మన దేశానికి రానున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన పైన్ గ్యాస్, జగ్  వసంత్  ఎల్పీజీ ట్యాంకర్లు శని లేదా ఆదివారం తిరిగి బయల్దేరనున్నాయి. ఈ మేరకు నౌకాయన మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

ప్రస్తుతం ఆ రెండు నౌకలు యునైటెడ్  అరబ్  ఎమిరేట్స్ లోని షార్జా తీరంలో లంగరు వేసి ఉన్నాయి. తిరిగి భారత్ కు బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు రెండు నౌకలు సిగ్నల్స్  పంపుతున్నాయని షిప్ ట్రాకింగ్  డేటా వెల్లడించింది. శనివారమే ఆ ట్యాంకర్లు బయల్దేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని షిప్పింగ్  శాఖ స్పెషల్  సెక్రటరీ రాజేష్​ కుమార్  తెలిపారు.

‘‘హార్మూజ్  జలసంధిలో చిక్కుకుపోయిన భారతీయ నౌకలు సురక్షితంగా మన దేశానికి చేరుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మన దేశానికి చెందిన 22 నౌకలు ప్రస్తుతం గల్ఫ్ లో చిక్కుకుని ఉన్నాయి. నౌకల సేఫ్  ప్యాసేజ్ పై ప్రధాని నరేంద్ర మోదీ గ్లోబల్  లీడర్లతో మాట్లాడుతున్నారు” అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్  జైస్వాల్  తెలిపారు. కాగా.. జగ్ వసంత్  ట్యాంకర్ ను భారత్  పెట్రోలియం కార్పొరేషన్  లిమిటెడ్  ఆపరేట్  చేస్తుండగా.. పైన్ గ్యాస్  ట్యాంకర్ ను ఇండియన్  ఆయిల్  కార్పొరేషన్  ఆపరేట్  చేస్తోంది. గత వారం రెండు భారత ఎల్పీజీ క్యారియర్లు హార్మూజ్  ద్వారా బయల్దేరేందుకు ఇరాన్  అనుమతించింది. ఇక హార్మూజ్  జలసంధి ద్వారా వెళ్లే నౌకలను పేల్చివేస్తామని ఇరాన్  హెచ్చరించడంతో ప్రస్తుతం కొన్ని వందల నౌకలు అక్కడే నిలిచిపోయాయి. గత 24 గంటల్లో ఏ క్రూడాయిల్  ట్యాంకర్  కూడా హార్మూజ్  దాటలేదు.