న్యూఢిల్లీ: ఇండియా అండర్–23 ఫాస్టెస్ట్ స్ప్రింటర్‌గా పేరు తెచ్చుకున్న తరణ్‌జీత్ కౌర్ డోప్ టెస్టులో ఫెయిలైంది. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) కండక్ట్ చేసిన ఇన్–కాంపిటీషన్ టెస్టులో ఆమె ఫెయిలైందని నాడా వర్గాలు శనివారం వెల్లడించాయి. 2021లో బెస్ట్ పెర్ఫామెన్స్ చేసిన ఇండియా యంగెస్ట్ అథ్లెట్లలో ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల తరణ్‌జీత్ కూడా ఉంది. సెప్టెంబర్‌లో జరిగిన నేషనల్ అండర్–23 చాంపియన్‌షిప్స్‌లో 100మీ, 200 మీ. రేసుల్లో గెలిచి డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించింది. 100మీ.లో 11.54 సెకండ్లు, 200 మీ.లో 23.57 సెకండ్లతో తన పర్సనల్ బెస్ట్ టైమింగ్ రికార్డు చేసింది. ఈ టోర్నీకి వారం ముందు నేషనల్ ఓపెన్‌చాంపియన్‌షిప్స్‌లో 100మీ. గోల్డ్, 200మీ. సిల్వర్‌తో సత్తాచాటింది. అయితే, ఈ రెండింటిలో ఒక టోర్నీ సందర్భంగా చేసిన డ్రగ్ టెస్టులోనే తరణ్‌జీత్ ఫెయిలైనట్టు తెలుస్తోంది. తరణ్‌జీత్ కౌర్ కేసును నాడా డిసిప్లినరీ ప్యానెల్ విచారించనుంది. ఒకవేళ ఆమె డోపీగా తేలితే తొలిసారి తప్పు చేసిన కారణంగా నాలుగేళ్ల వరకూ బ్యాన్ పడే అవకాశం ఉంది.

