- రెండు పార్టీల నుంచి బీఫాంలు
- బీఆర్ఎస్ బీఫాం దగ్గర పెట్టుకొని కాంగ్రెస్ బీఫాం సమర్పణ
- బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ
యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ బరిలో నిలిచిన ఒక అభ్యర్థికి బీఆర్ఎస్, కాంగ్రెస్ బీఫాం ఇచ్చాయి. సదరు అభ్యర్థి బీఆర్ఎస్ బీఫాం తన వద్ద ఉంచుకొని కాంగ్రెస్ బీఫాంను అధికారులకు అందజేశారు. కాంగ్రెస్లో కొనసాగుతున్న చింతల ఉమామహేశ్వరి చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 17 వార్డు టికెట్ ఆశించారు. ఆ పార్టీ సానుకూలంగా లేకపోవడంతో బీఆర్ఎస్ను సంప్రందించారు. ఆ పార్టీ నుంచి కూడా తొలుత స్పష్టమైన హామీ రాకపోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు ఇండిపెండెంట్గా మూడు నామినేషన్లు దాఖలు చేశారు.
బీఆర్ఎస్ నుంచి హామీ రావడంతో రెండ్రోజుల కింద భర్త సాయిలుతో కలిసి ఆ పార్టీలో చేరారు. బీఫాం కూడా ఇచ్చేశారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన మల్లమ్మ అనే మహిళ, ఇంటర్నల్ అవగాహనతో ఉండడంతో బీజేపీ నుంచి నామినేషన్ వేసిన శ్రావణి కూడా విత్ డ్రా చేసుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి ఆఫర్ రావడంతో పాటు బీఫాం తీసుకున్న ఉమమహేశ్వరి కాంగ్రెస్లో చేరుతున్నట్లు ప్రకటించి, బీఫాం దాఖలు చేశారు.
దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
