తెలంగాణకు మళ్లీ మొండిచేయి!..మూడు హైస్పీడ్ రైళ్లు తప్ప.. బడ్జెట్‌‌లో పైసా కేటాయించలేదు

తెలంగాణకు మళ్లీ మొండిచేయి!..మూడు హైస్పీడ్ రైళ్లు తప్ప.. బడ్జెట్‌‌లో పైసా కేటాయించలేదు

 

  • పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలే దిక్కు 
  • రాష్ట్రం రూ.1.46 లక్షల కోట్లు అడిగితే.. రూపాయి కూడా ఇవ్వలే
  • మూసీ, మెట్రో, ట్రిపుల్ ఆర్, ఎయిర్‌‌‌‌పోర్టు ప్రాజెక్టులకు కేటాయింపుల్లేవ్ 
  • ఐఐఎం, నవోదయ విద్యాలయాల్లేవ్  ..విభజన హామీలనూ పట్టించుకోలేదు

హైదరాబాద్, వెలుగు: ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్‌‌ తెలంగాణకు తీవ్ర నిరాశ మిగిల్చింది. రాష్ట్రానికి మళ్లీ మొండిచేయి ఎదురైంది. వికసిత్​భారత్‌‌కు అనుగుణంగా తీసుకొచ్చిన తెలంగాణ రైజింగ్ విజన్-2047 లక్ష్యాలకు ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రకటనలు తప్ప.. అభివృద్ధికి సంబంధించి కొత్తగా ఒరిగిందేమీ లేదు. హక్కుగా వచ్చే పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు మినహా అదనపు నిధులేమీ కేటాయించలేదు. విభజన హామీల ఊసు కూడా ఎత్తలేదు. సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు అనేకసార్లు ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాలను వివరించారు. వివిధ ప్రాజెక్టుల కోసం రూ.1.46 లక్షల కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు.  ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.50 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా అదనంగా రాలేదు. కాగా, సెంట్రల్లీ స్పాన్సర్డ్​ స్కీమ్స్​లో కేంద్ర ప్రభుత్వ వాటా కింద రాష్ట్రాలకు రూ.5.48 లక్షల కోట్లు కేటాయించగా.. ఇందులో 
తెలంగాణకు రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల దాకా వస్తాయని అంచనా వేస్తున్నారు.

విజ్ఞప్తులను వినిపించుకోలేదు.. 

హైదరాబాద్ అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రాజెక్టులను కేంద్రం తుంగలో తొక్కింది. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్రం రూ.34,367 కోట్లు, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్‌కు రేడియల్ రోడ్ల కోసం రూ.45,000 కోట్లు, మెట్రో రెండో దశ విస్తరణకు రూ.44,028 కోట్లు అడిగింది. కానీ కేంద్రం వీటికి పైసా ఇవ్వలేదు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, గోదావరి-–మూసీ అనుసంధానానికి కూడా ఒక్క రూపాయి రాలేదు. ఫ్యూచర్ సిటీ, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి పనులకు మొండిచేయి చూపింది. మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలు ఇంకా కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉండిపోయాయి. రైల్వే కనెక్టివిటీ, విద్యా రంగాల్లోనూ తెలంగాణకు నిరాశే ఎదురైంది. రాష్ట్రం కోరిన 8 కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలపైనా స్పందించలేదు. ఐఐఎం, నవోదయ విద్యాలయాల కోసం విన్నవించినా ఫలితం లేదు. సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చాలన్న అభ్యర్థనను కూడా తోసిపుచ్చారు. పరిశ్రమల స్థాపన, పీఎం మిత్ర పార్కులకు కేంద్రం చేయూతనివ్వలేదు. గిరిజన వర్సిటీకి కొత్తగా నిధులు కేటాయించలేదు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, విద్యాసంస్థల అభివృద్ధికి ఆర్థిక సహాకారం అందించాలన్న  సీఎం, రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తులను కేంద్రం పెడచెవిన పెట్టింది. 

ఏపీకి వరాల జల్లు కురిపించిన కేంద్రం.. 

తెలంగాణను మాత్రం విస్మరించింది. ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు దండిగా నిధులు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కానీ మన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు మాత్రం నయాపైసా విదిలించలేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై 2014 నుంచి సాగుతున్న నిర్లక్ష్యం కొనసాగింది. విభజన చట్టంలో ఉన్న ప్రధాన హామీలను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పక్క రాష్ట్రానికి పాలు, మన రాష్ట్రానికి నీళ్లు అన్నట్లుగా కేంద్రం తీరు ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విద్యుత్, మైనింగ్ రంగాల్లోనూ కేంద్రం నుంచి తెలంగాణకు సహాయం అందలేదు. సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపు, పీఎం- కుసుమ్ కింద సోలార్ పంప్ సెట్ల కేటాయింపును పట్టించుకోలేదు. పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ఇళ్లకు కేటాయింపులు నామమాత్రంగానే ఇచ్చింది. దాదాపు 12 విభాగాలకు చెందిన 47 అంశాలపై  రాష్ట్రం ఎన్నిసార్లు విన్నవించినా ఆయా ప్రాజెక్టులకు బడ్జెట్​లో మోక్షం కలుగలేదు.  

గత రెండు బడ్జెట్ల​లోనూ నిరాశే..

  •   ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించింది. ఇందులో పుణె–హైదరాబాద్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్ – చెన్నై కారిడార్లు ఉన్నాయి. హైదరాబాద్ అటోమిట్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ కు రూ.405 .97 కోట్లు కేటాయించింది. అయితే ఐఐటీ హైదరాబాద్‌కు గత రెండు బడ్జెట్ లలో కేటాయింపులనే మరించింది. చివరగా 2‌024–25లో 121.84 కోట్లు కేటాయించింది. ఇక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయితీ రాజ్, హైదరాబాద్ కు ఈ బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదుకాగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సీసీఎల్) కు ఎక్స్ టర్నల్ అండ్ ఎక్ట్రా బడ్జెటరీ రీసోర్స్ (ఐఈబీఆర్) కింద రూ. 2,500 కోట్లు కేటాయించింది. 
  •  హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ.30 కోట్లు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ హిందీకి రూ.26 కోట్లు, దేశవ్యాప్తంగా 12 నగరాల్లో ఉన్న సీ–డాక్‌కు రూ.280 కోట్లు, నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు రూ.14.55 కోట్లు కేటాయించారు. స్వాతంత్ర్య సమరయోధులు, నిజాం వ్యతిరేక పోరాట యోధుల పెన్షన్లకు రూ.589.97 కోట్లు కేటాయించగా, జాతీయ పోలీసు అకాడమీ సహా పోలీసు శిక్షణ, పరిశోధనలకు రూ.908.78 కోట్లు కేటాయింపులు చేశారు.
  •   హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌కు ఈ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అలాగే దేశంలోని 25 స్వయంప్రతిపత్తి కేంద్రాలకు రూ.1,643.87 కోట్లు, సీడీఎఫ్​డీ, ఎన్​ఐఏబీ తదితర సంస్థలకు రూ.1,002.13 కోట్లు, మణుగూరు సహా భారజల ప్లాంట్లకు రూ.1,745.52 కోట్లు కేటాయించారు.