V6 News

గోదాముల ఏర్పాటుకు లక్ష కోట్లు..కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం

గోదాముల ఏర్పాటుకు లక్ష కోట్లు..కేంద్ర కేబినెట్ భేటీలో నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో ఆహార ధాన్యాలు నిల్వ చేసేందుకు కొత్త గోదాములు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రానున్న ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. కోఆపరేటివ్ సెక్టార్​లో పెద్ద ఎత్తున గోదాములు నిర్మించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ‘‘మన దేశంలో ఏటా 31 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండుతున్నాయి. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోదాములలో 14.50 కోట్ల టన్నుల ధాన్యాలను మాత్రమే నిల్వ చేయొచ్చు. ఈ నేపథ్యంలో కొత్తగా 7 కోట్ల టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మించాలని నిర్ణయించాం” అని వివరించారు. ఒక్కో జిల్లాలో 2 వేల టన్నుల సామర్థ్యం గల గోదాములు నిర్మిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ చెప్పారు.

10 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు.. 

మన దేశంలో వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) లక్ష ఉన్నాయని, వీటిలో 63 వేలు పని చేస్తున్నాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మొదట పైలట్ ప్రాజెక్టు కింద ప్యాక్స్​ల పరిధిలో 10 జిల్లాల్లో గోడౌన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. దీనికోసం అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, కన్జ్యూమర్ అఫైర్స్ మంత్రిత్వ శాఖల నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు. కేవలం గోదాముల నిర్మాణమే కాకుండా, ప్యాక్స్ ల బలోపేతానికి వివిధ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.