ఎంఎస్ఎంఈ, టెక్స్‌టైల్ శాఖల పథకాలపై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. హన్మకొండ జిల్లా మడికొండ టెక్స్‌టైల్ పార్కును శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులోని వివిధ టెక్స్‌టైల్ యూనిట్లను పరిశీలించిన ఆయన.. పరిశ్రమల యజమానులు, కార్మికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టెక్స్‌టైల్ యూనిట్లు ఎదుర్కొంటున్న సమస్యలను, కార్మికుల సాధకబాధకాలను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు.
గతంలో వచ్చిన కరోనా మహమ్మారి ప్రభావంతో యూనిట్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని పరిశ్రమల యాజమాన్యాలు బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా బ్యాంకు లోన్లు, వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) వంటి సమస్యలు వేధిస్తున్నాయని.. వీటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని వారు మంత్రిని విజ్ఞప్తి చేశారు.
యాజమాన్యాల సమస్యలపై స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్.. ఎంఎస్ఎంఈ, టెక్స్‌టైల్ శాఖల పథకాలపై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిపుణులతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి, సమస్యలపై పూర్తి స్థాయి నివేదిక (రిపోర్ట్) తయారు చేయాలని వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఢిల్లీలో సంబంధిత కేంద్ర మంత్రులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని హామీ ఇచ్చారు.
మడికొండలో ఒక్క టెక్స్‌టైల్ యూనిట్ కూడా మూతపడనివ్వం. ఇక్కడ ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కార్మికుల ఉపాధిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. సూరత్ నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టిన వ్యాపారులను సైతం ఆదుకుంటాం. కొత్త రుణ సౌకర్యాలు, పన్ను ఉపశమన చర్యలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తాం అని బండి సంజయ్ స్పష్టమైన భరోసా ఇచ్చారు.
అంతేకాదు స్థానికంగా ఇబ్బందిగా మారిన డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కూడా తాము అండగా ఉంటామని మంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వ కనీస బాధ్యత అని స్పష్టం చేస్తూ.. మడికొండ టెక్స్‌టైల్ పార్కును పూర్వ వైభవానికి తీసుకొస్తామని బండి సంజయ్ ప్రకటించారు.
