
కరీంనగర్: పాకిస్థాన్‌తో యుద్ధం ఆగిపోలేదని.. ఆ దేశం ఉగ్రవాదాన్ని పోషించినన్నాళ్లు వార్ చేస్తూనే ఉంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ తేల్చి చెప్పారు. భారత్ ఉఫ్ మని ఊదితే పాకిస్తాన్ ఖతమైపోతదని హెచ్చరించారు. పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నదనే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని.. భారత సైన్యానికి బాసటగా నిలవండని పిలుపునిచ్చారు. కొంచెం వర్షం పడగానే మనం తడవకుండా దాచుకుంటాం.. కానీ సరిహద్దుల్లో మంచు, వాన, ఎండ, చలికి వెరవకుండా పోరాడుతున్న సైనికులకు హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నారు. గురువారం (మే 22) కరీంనగర్లో బండి సంజయ్ హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కుహానా లౌకిక వాదులకు వార్నింగ్ ఇవ్వడానికే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని.. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా తరలివచ్చిన ప్రజలందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో మహిళా సైనికుల చూపిన వీరోచిత పోరాటాలు భేష్ అని కొనియాడారు. భార్య ముందు భర్తను, పిల్లల ముందు తండ్రిని, తల్లి ముందు కొడుకును పెహల్గాంలో ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపారని.. అందుకే పాకిస్తాన్‌పై దాడి చేసి ప్రధాని మోడీ భారత్ సైన్యం సత్తాను చాటి చెప్పారన్నారు.
భారత సైన్యానికి సంఘీభావంగా, ప్రధాని మోడీకి మద్దతుగా హిందూ ఏక్తా యాత్ర ర్యాలీని కొనసాగిద్దమన్నారు. హిందూ ఏక్తా యాత్రకు తరలివచ్చిన ఈ జనాన్ని చూస్తుంటే నాలో రక్తం ఉరకలేస్తోందని.. మీ కోసం ఏందాకైనా పోరాడాలన్పిస్తోందన్నారు. ఇక నుంచి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని అన్నారు.పెహల్గాం ఉగ్రదాడి తర్వాత హిందువుల్లో ఐక్యతగా ఉండాలనే ఆలోచన వచ్చిందన్నారు. ఉగ్రవాదులు మతం అడిగి బట్టలిప్పి హిందువని తెలిశాకే చంపేశారని.. ఈ చర్యకు కౌంటర్‌గా ప్రధాని మోడీ ఏం చేశారో చూశారో తెలుసు కదా.. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఆ ఉగ్రవాదులను అంతమొందించారని గుర్తు చేశారు.
ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు. అమెరికా ట్విన్ టవర్స్‌పై అల్ ఖైదా దాడి చేసి 6 వేల మందిని చంపితే.. 10 ఏళ్ల దాకా వాళ్లు ఏమి చేయలేకపోయారని..10 సంవత్సరాల తరువాతే ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకుని అమెరికా చంపింది. కానీ పెహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే ఉగ్రవాదుల అంతు చూసిన చరిత్ర నా భారత సైన్యానిదని కొనియాడారు.
పాకిస్తాన్‌పై యుద్దం చిన్నదని తక్కువ చేసిన మల్లికార్జున్ ఖర్గేకి సవాల్ చేస్తున్నా.. పాకిస్తాన్ లోపలకు వెళ్లి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా..? పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 11 మిలటరీ బేస్‌లను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా..? 20 శాతం మేరకు పాకిస్తాన్ మిలటరీ మౌలిక వసతులను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా..? మన సైన్యం దెబ్బకు భయపడి యుద్దం ఆపాలంటూ పాక్ కాళ్ల బేరానికి రావడం చిన్న యుద్ధమా? ఏది చిన్న యుద్దమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
యుద్దంలో ఎన్ని రాఫెల్ విమానాలు ధ్వంసమయ్యాయో లెక్క చెప్పాలని రాహుల్ గాంధీ మాట్లాడటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. మన సైన్య శౌర్య పరాక్రమాలను పొగడాల్సింది పోయి తక్కువ చేసి చూపుతారా..? అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీకి భారత దేశంలో కంటే పాకిస్థాన్‌లోనే ఎక్కువ మంది అభిమానులున్నారట. పాకిస్థాన్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ట్రెండింగ్‌లో ఉండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ట్రంప్‌కు భయపడి ప్రధాని మోడీ యుద్దం ఆపేసిండని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.