బీరు, బ్రాందీ ఎక్కువ అమ్మడం అభివృద్ధా? : కిషన్‌‌రెడ్డి

బీరు, బ్రాందీ ఎక్కువ అమ్మడం అభివృద్ధా? : కిషన్‌‌రెడ్డి
  •     ప్రజారోగ్యాన్ని కొల్లగొడుతూ.. వారి జేబులకు చిల్లుపెడుతున్నారు: కిషన్‌‌రెడ్డి
  •     కాంగ్రెస్‌‌కు తెలంగాణ ఏటీఏంలా మారింది 
  •     కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే.. ఆ పార్టీల మధ్య ఢిల్లీలో రహస్య ఒప్పందం 
  •     అందుకే ఫోన్ ట్యాపింగ్, అవినీతిపై చర్యల్లేవని కామెంట్​
  •     ఏడాదిలోనే రూ.80 వేల కోట్ల కొత్త అప్పు: రాంచందర్​ రావు
  •     ‘12 ఏండ్ల తెలంగాణలో పట్టణాల విధ్వంసం’ పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్, కాంగ్రెస్​ అంటున్నాయని, అభివృద్ధి అంటే వారి దృష్టిలో అవినీతి అని కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి మండిపడ్డారు.  ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొడుతూ.. వారి జేబులకు చిల్లులుపెడుతూ బీరు.. బ్రాందీ సప్లై చేస్తున్నారని ఆరోపించారు. బీరు, బ్రాందీ ఎలా అమ్మాలి? భూములు ఎలా అమ్మాలి? అనే దానిపైనే సర్కారు ఆలోచన చేస్తున్నదని చెప్పారు. అభివృద్ధి అంటే బీరు, బ్రాందీ, విస్కీ అమ్మడమేనా? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాలు నడవడం లేదని, మజ్లిస్ పార్టీ మన్ననల కోసం దారుస్సలాంకు ‘హుజూర్’ అనే బానిస ప్రభుత్వాలు నడుస్తున్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలన, ప్రస్తుత కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అభివృద్ధి అంటే కేవలం అవినీతి, కమీషన్లు దండుకోవడమే అన్నట్లుగా తయారైందని ఆరోపించారు. 

గురువారం హైదరాబాద్‌‌లో  ‘12 ఏండ్ల తెలంగాణలో పట్టణాల విధ్వంసం’ పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాచందర్‌‌‌‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కిషన్‌‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలనలో మార్పు రాలేదని, కేవలం దోచుకోవడం, దాచుకోవడంలోనే మార్పు వచ్చిందని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఒక ఏటీఎంలా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో దోచుకున్న వేల కోట్లను ఢిల్లీకి పంపిస్తున్నారన్నారు. మిగులు బడ్జెట్‌‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని, కనీసం వీధి లైట్లకు బిల్లులు కట్టలేని, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములను అమ్ముకోవడం, ఖజానాకు గండి కొట్టడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయన్నారు. 

ఫోన్ ట్యాపింగ్.. ఒక డ్రామా 

సీఎం రేవంత్‌‌రెడ్డి హయాంలో ఫోన్ ట్యాపింగ్ విచారణ ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు’గా మారిందని కిషన్‌‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేసేంత దుర్మార్గమైన పాలన గతంలో జరిగినా, రేవంత్ ప్రభుత్వం కేవలం ఒక డీఎస్పీని సీఐగా డిమోషన్ చేసి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. దీన్నిబట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందాలు కుదిరాయని స్పష్టమవుతున్నదన్నారు. 

రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీఆర్ మధ్య ఢిల్లీ స్థాయిలో ఒప్పందం, అండర్‌‌స్టాండింగ్ కుదిరింది కాబట్టే తెలంగాణలో ఎవరి మీదా చర్యలు ఉండవని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలోనూ రెండు పార్టీలకూ తేడా లేదని అన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లు, చైర్మన్లు, చివరకు హైదరాబాద్ మేయర్ కూడా కాంగ్రెస్‌‌లో చేరారని గుర్తుచేశారు. అందుకే బీఆర్ఎస్‌‌కు ఓటు వేయడమంటే కాంగ్రెస్‌‌కు వేసినట్టేనని, ప్రజలు ఈ నిజాన్ని గ్రహించాలని పిలుపునిచ్చారు.

ఒక్క ఏడాదిలోనే రూ.80 వేల కోట్ల కొత్త అప్పులు: రాంచందర్ రావు 

గత 12 ఏండ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పట్టణాలు ఆర్థికంగా, పరిపాలనా పరంగా కుప్పకూలాయని  రాంచందర్‌‌‌‌రావు అన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలపై రూ.3,600 కోట్లు, జీహెచ్ఎంసీపై రూ.5 వేల కోట్ల అప్పులు పేరుకుపోయాయని చెప్పారు. కాంగ్రెస్​ సర్కారు ఏడాది కాలంలోనే రూ.80 వేల కోట్ల కొత్త అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని అన్నారు. 

ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజలను మోసం చేసిందని, ఫ్రీ బస్ పేరుతో డొక్కు బస్సుల్లో మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని ఆరోపించారు.  మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి రాష్ట్రాన్ని కాపాడాలని రాంచందర్‌‌‌‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆశిశ్‌‌ షెలార్, పార్టీ నేతలు వీరేందర్‌‌‌‌గౌడ్, బీబీ పాటిల్, భరత్ గౌడ్, లంకల దీపక్‌‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.