నైనీ బ్లాక్ పై మంత్రుల మధ్య లొల్లి...రెండు గ్రూపులు గా విడిపోయి కొట్టుకుంటున్నరు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

నైనీ బ్లాక్ పై  మంత్రుల మధ్య లొల్లి...రెండు గ్రూపులు గా విడిపోయి కొట్టుకుంటున్నరు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: నైనీ కోల్ బ్లాక్ విషయంలో మంత్రులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గనుల కేటాయింపులో టెండర్లకు ముందు ‘సైట్ విజిట్’ సర్టిఫికెట్ తప్పనిసరి అనే నిబంధన సరికాదని చెప్పారు. కార్మికుల భవిష్యత్ కోసం సింగరేణి యాజమాన్యం పనిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.51 వేల కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల వారీగా కాకుండా దేశ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ రూపొందించామని, ఇందులో తెలంగాణకు పెద్దపీట వేశామని చెప్పారు.

హైదరాబాద్‌‌ను ‘హబ్స్ ఆఫ్ హబ్’గా తీర్చిదిద్దుతున్నామని, ఫార్మా రంగానికి బూస్ట్ ఇచ్చేలా నైపర్ అప్‌‌గ్రేడ్, మూడు హైస్పీడ్ రైల్వే కారిడార్లు, రూ.42 వేల కోట్లతో నేషనల్ హైవేలు, డేటా సెంటర్లకు పన్ను రాయితీలు వంటివి బడ్జెట్‌‌లో పొందుపరిచామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.12 వేల కోట్లు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేసినా, కేంద్రమే బాధ్యత తీసుకుని పనులు పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. 

సీఎం రేవంత్ రెడ్డికి ‘వన్ నేషన్.. వన్ రేషన్.. వన్ టెక్నాలజీ’ అంటే ఏంటో అర్థం కాదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ రోజుకో తప్పు చేస్తున్నారని, అది ఆ పార్టీ చేసుకున్న ఖర్మ అని విమర్శించారు. మేడారం జాతర కోసం కేంద్రం రూ.3 కోట్లకు పైగా కేటాయించిందని, అయితే ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా చేతికి ఇవ్వబోమని, అభివృద్ధి పనులు చేశాకే నిధులు విడుదల చేస్తామని షరతు పెట్టామని వివరించారు.

ముందు మీ పార్టీని కాపాడుకోండి?

కమ్యూనిస్టులు నరేంద్ర మోదీని గద్దెదించుతామని అంటున్నారని, వాళ్లకు ఉన్న ఒక్క సీటుతో ఎట్లా దించుతారని ప్రశ్నించారు. ‘ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎక్కడున్నారు.?  ఒక్క సీటుతో ఎట్ల దించుతారు. ముందు పార్టీని కాపాడుకుంటే మంచిది’ అని సూచించారు. ‘సర్’ను కేంద్ర ప్రభుత్వం.. మోదీ వచ్చి చేయబోరని.. స్టేట్ గవర్నమెంట్ అధికారులే చేస్తారని చెప్పారు.