బీజేపీ గెలుపుతో బెంగాలీలకు మంచిరోజులు..తెలంగాణలో ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది: కిషన్రెడ్డి

బీజేపీ గెలుపుతో బెంగాలీలకు మంచిరోజులు..తెలంగాణలో ఈ ఎన్నికల ప్రభావం ఉంటుంది: కిషన్రెడ్డి
  • కేసీఆర్, రేవంత్ సర్కార్ల మధ్య తేడా లేదని విమర్శ
  • కేంద్రమంత్రి నేతృత్వంలో 
  • ఢిల్లీలో విజయోత్సవ ర్యాలీ

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ గెలుపుతో వెస్ట్ బెంగాల్ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బెంగాల్ లో డబుల్ ఇంజన్ సర్కారు అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. బెంగాల్ లో భారీ గెలుపు నేపథ్యంలో ‘విజయోత్సవ ర్యాలీ’ నిర్వహించారు. సోమవారం ఢిల్లీ అశోక్ రోడ్ లోని తన అధికారిక నివాసం నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

చివరగా తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ర్యాలీని ముగించారు. అంతకు ముందు ఆయన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ప్రధాని మోదీని ఆశీర్వదించారన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజల ఆశీస్సులతో ఎన్డీయే నేతృత్వంలో భారీ మెజారిటీతో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చిందని వివరించారు. 15 ఏండ్ల టీఎంసీ పాలనలో బెంగాల్ అస్తవ్యస్తం అయిందని విమర్శించారు.

టీఎంసీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గూండాలకు ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు ఇచ్చి పెంచిపోషించిందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని సీపీఎం, టీఎంసీ సీఎంలు జంగల్ రాజ్ గా మార్చారని ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ నుంచి లక్షలాదిగా  వలస వచ్చిన చొరబాటుదారులు బెంగాల్ ప్రజలపై దాడులు చేశారని ఆరోపించారు. తృణమూల్ అండతో బెంగాలీలపై వారు చేయని దౌర్జన్యం లేదన్నారు.

ముఖ్యంగా బెంగాల్ లో కోల్ మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో.. టీఎంసీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారని ఆరోపించారు. ఈ అక్రమ దందాను అడ్డుకోవాలని ఎన్నిసార్లు కోరినా మమతా బెనర్జీ స్పందించలేదని తెలిపారు. అందుకే రాణిగంజ్ సహా వివిధ కోల్ బెల్ట్ నియోజకవర్గాల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచిందన్నారు.

తెలంగాణలో ఈ ఎన్నికల ప్రభావం...

తెలంగాణలోనూ ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం చాలా సానుకూలంగా ఉండనుందని కిషన్ రెడ్డి అన్నారు. అలాగే దక్షిణాదిలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో.. అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం పెరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ దేశంలో పూర్తిగా కనుమరుగైందని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోతోందన్నారు. దేశ ప్రజలంతా దేశంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అందరం కలిసికట్టుగాపని చేసి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు