న్యూఢిల్లీ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేఓసీ (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్) డీప్‌సైడ్ ఎక్స్ టెన్షన్ బ్లాక్ వేలం నుంచి తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (జెన్ కో) తప్పుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ఆ గని కోసం సింగరేణి, జెన్కో పోటీపడ్తున్నాయని, జెన్కో తప్పుకుంటే అనివార్యంగా సింగరేణికే గని దక్కుతుందని స్పష్టం చేశారు.
జెన్ కోను వేలం నుంచి తప్పించేలా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. నైనీ, తాడిచర్ల –2 బ్లాక్‌లను కేంద్రం ఇప్పటికే సింగరేణికి కేటాయించిందని, మణుగూరు కూడా సింగరేణికి దక్కితే.. సంస్థకు మంచి భవిష్యత్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. సోమవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇటీవల వేలం ప్రక్రియలో చేర్చిన మణుగూరు పీకేఓసీ బ్లాక్ కూడా సింగరేణికి రావాలనే దృక్పథంతో కేంద్రం ఉందన్నారు. కానీ తెలంగాణ జెన్‌కో సింగరేణికి పోటీగా టెండర్‌లో పాల్గొందని చెప్పారు. తెలంగాణ జెన్‌కోకు గతంలో.. తాడిచర్ల-–1 క్యాప్టివ్ మైన్ కేటాయిస్తే.. దీన్ని ఎండీవో బాధ్యతలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందని గుర్తు చేశారు.
ఈ పీకేఓసీ బ్లాక్ సింగరేణికి రావాలనేదే తమ తాపత్రయం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ టెండర్లనుంచి.. జెన్‌కో వెనక్కు తగ్గి.. దీన్ని సింగరేణికి ఇచ్చేలా చొరవతీసుకోవాలని సీఎంకు సూచించారు. ‘నైని, తాడిచర్ల–2 తోపాటు పీకేఓసీ డిప్ ఎక్స్‌టెన్షన్ కూడా దక్కితే.. సింగరేణికి మేలు జరుగుతుంది. ఈ మూడు బ్లాక్‌ల ద్వారా దాదాపు 6,500 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. సుమారు 830 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది.
ఏటా రూ. లక్షా 95 వేల కోట్ల టర్నోవర్ సింగరేణికి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.40 వేల కోట్ల లాభం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, సింగరేణికి ఈ బ్లాక్ కట్టబెట్టాలి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లెటర్ రాస్తా” అని తెలిపారు. నైనీ బ్లాక్‌ను సింగరేణికి ఇస్తే.. మంత్రులు గొడవపడి రోడ్డెక్కారని విమర్శించారు. అయినప్పటికీ తాడిచర్ల– -2 బొగ్గు బ్లాక్ కేటాయింపులో ఉన్న న్యాయపరమైన అంశాలను పరిష్కరించి సింగరేణికి దక్కేలా చొరవతీసుకున్నామని చెప్పారు.
బంగారు బాతుగా మార్చుకున్నయ్..
సహకార, సమాఖ్య స్ఫూర్తితో సింగరేణి భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతర సహకారం అందిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతుగా మార్చుకున్నాయని విమర్శించారు. కేసీఆర్ మొండి వైఖరితో సింగరేణి వ్యతిరేక విధానాలను అవలంబించారని చెప్పారు. దేశంలోని అన్ని పీఎస్ యూలు కేంద్రం తెచ్చిన వేలంలో పాల్గొని బొగ్గు గనులు తీసుకుంటే.. కేసీఆర్ ప్రభుత్వం వేలంలో పాల్గొనలేదన్నారు.
పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ కొత్త బ్లాకులు తీసుకోకుండా వచ్చే ఆదాయానికి గండికొట్టిందని ఆరోపించారు. దీని కారణంగా ఉత్పత్తి తగ్గడం, నాణ్యమైన బొగ్గు లేకపోవడం, ప్రభుత్వాలు సింగరేణి బొగ్గును తీసుకుని విద్యుదుత్పత్తి సంస్థల నుంచి డబ్బులను జమచేయకపోవడంతో సింగరేణి సంస్థ అనేక కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ఇందుకోసం ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌ను 2015లో సింగరేణికి విద్యుదుత్పత్తి కోసం మోదీ సర్కారు కేటాయించిందని గుర్తు చేశారు.
కేసీఆర్ ఏమాత్రం దీన్ని పట్టించుకోలేదన్నారు. ఒడిశా సీఎంతో కనీసం మాట్లాడలేదని, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోలేదని ఆరోపించారు. అయితే గడిచిన రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ రెండు పార్టీల పాపం కారణంగా.. సింగరేణికి రూ.54 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు.‘‘దేశంలో ఏ ప్రభుత్వరంగ సంస్థకూ ఇంతపెద్ద ఎత్తున బకాయిలు లేవు.
తెలంగాణ సమాజమంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నాడు.. బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్‌స్ట్రక్షన్ (బీఐఎఫ్ఆర్)లో కూరుకుపోయిన సింగరేణికి వాజ్‌పేయి ప్రభుత్వం సహకారం అందించింది. రూ.684 కోట్ల అప్పుపై మారటోరియం విధించింది. సింగరేణి అభివృద్ధికి అదనంగా రూ.525 కోట్ల ఆర్థిక సహకారం అందించింది” అని తెలిపారు.
పార్లమెంట్‌లో కాంగ్రెస్ తీరుపై..
పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లు– -2026కు స్వాగతం పలికి.. అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తే.. ఇందుకు భిన్నంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370, డిజిటల్ ట్రాన్సాక్షన్, రైతు చట్టాలలాంటి ఎన్నింటినో కాంగ్రెస్, ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. ఈ బిల్లుకైనా.. కాంగ్రెస్ పార్టీ సహకరిస్తోందని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ తీరు భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా.. ఏ పరీక్షల ఫలితాలు వచ్చినా.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఇది దురదృష్టకరం. వారంతా మన పిల్లలే. వారికి అందరూ అండగా నిలవాలి’’ అని హితవు పలికారు. అయితే.. జంతర్ మంతర్‌లో జరిగిన దాడి దురదృష్టకరమన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ చరిత్ర మరిచి మాట్లాడుతోంది. తెలంగాణ ఉద్యమంలో.. జై తెలంగాణ అన్న పాపానికి.. 369 మందిని పోలీసు తూటాలతో కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చలో రాజ్ భవన్‌కు పిలుపునిస్తే.. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ధర్నా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాల్చి చంపింది. మెదక్ జిల్లా సదాశివపేటలో ఇలాగే కాల్చి చంపింది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. దీనిపై మాట్లాడాలి’’ అని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీలు హాస్యాస్పదం
హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి క్యాండిల్ ర్యాలీలు చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు. విద్యార్థులు తమ ధర్నాను విరమించుకుంటే.. ఎక్కువ హింస జరగలేదని కాంగ్రెస్ పార్టీ.. రాహుల్ గాంధీ బాధపడుతున్నట్టు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. గురివింద గింజ సామెతలాగా.. రాహుల్, రేవంత్, మల్లికార్జున ఖర్గే నీతిసూత్రాలు వల్లెవేస్తున్నారన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలో.. ఎన్నిసార్లు ప్రశ్నాపత్రాలు లీకయ్యాయో చెప్పగలరా..? దీనిపై పార్లమెంటులో చర్చకు సిద్ధమా..? బిల్లుపై చర్చలో పాల్గొని.. గొంతు వినిపించే ధైర్యం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు’’ అని పేర్కొన్నారు.
తమ హయాంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజ్‌పై బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో లీకేజీ మామూలే అన్న ప్రియాంక గాంధీ ఈ రోజు పార్లమెంటు లోపలా, బయటా ఆందోళన చేపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు.‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో.. దేశహితం కోసం, దేశాభివృద్ధి కోసం ఏ ఉద్యమాలు చేసినా తప్పులేదు. కానీ దేశానికి నష్టం కలిగించే విధంగా వచ్చే వాటిని ప్రోత్సహించొద్దు. మాకు దేశహితమే ప్రధానం. ఆపరేషన్ సింధూర్ అయినా, ఆర్టికల్ 370 అయినా, సర్జికల్ స్ట్రైక్ అయినా.. నేషన్ ఫస్ట్ మా పాలసీ. డిజిటల్ ట్రాన్సాక్షన్ విషయంలో మనం ప్రపంచంలోనే టాప్’’ అని వ్యాఖ్యానించారు.
