డిగ్రీ, పీజీ కాలేజీల సెలవులు పొడిగించిన వర్సిటీలు

డిగ్రీ, పీజీ కాలేజీల సెలవులు పొడిగించిన వర్సిటీలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా డిగ్రీ, పీజీ విద్యార్థులకు వేసవి సెలవులను పొడిగిస్తూ పలు యూనివర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు,  మహాత్మాగాంధీ వర్సిటీల పరిధిలోని కాలేజీలు జూన్ 8వ తేదీన తిరిగి ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి జూన్ 1 నుంచి కాలేజీలు తెరుచుకోవాల్సి ఉంది. 

అయితే, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటం, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సెలవులను వారం రోజుల పాటు పొడిగించారు. ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ వర్సిటీలు వేసవి సెలవులను జూన్ 6 వరకు పొడిగించాయి. తిరిగి జూన్ 8 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. శాతవాహన యూనివర్సిటీ సెలవులను జూన్ 5 వరకు పొడిగించింది. కాలేజీలు జూన్ 6న రీ ఓపెన్ అవుతాయి. అయితే, ఈ సెలవుల పొడిగింపు కేవలం విద్యార్థులకు, బోధనా సిబ్బందికి మాత్రమేనని వర్సిటీలు స్పష్టం చేశాయి.