V6 News

యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి ..గంగా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభించిన  ప్రధాని మోదీ

యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి ..గంగా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభించిన  ప్రధాని మోదీ

హర్దోయ్‌‌‌‌ (యూపీ): గంగా ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వే కేవలం హై-స్పీడ్ రహదారి మాత్రమే కాదని, అది యూపీ రాష్ట్ర పురోగతికి కొత్త ‘జీవనాడి’  అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.  ఇది గ్రామాలు, రైతులు, పారిశ్రామికవేత్తలు, యువతను అనుసంధానిస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రయాణానికి కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు. యూపీలోని మీరట్ నుంచి ప్రయాగ్‌‌‌‌రాజ్ వరకు 594 కిలోమీటర్ల మేర నిర్మించిన అత్యంత పొడవైన ‘గంగా ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వే’ను ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు.

హర్దోయ్ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.ఈ గ్రీన్‌‌‌‌ఫీల్డ్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు.

‘‘వేల ఏండ్లుగా గంగామాత ఏ విధంగానైతే యూపీకి, దేశానికి జీవనాడిలా నిలిచిందో.. అదే విధంగా ఈ గంగా నది సమీపం నుంచే వెళ్లే ఈ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వే ఆధునిక కాలంలో రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఇంజిన్‌‌‌‌గా మారుతుంది” అని పేర్కొన్నారు.  దాదాపు 600 కిలోమీటర్ల పొడవుతో.. దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌‌‌‌ఫీల్డ్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేగా నిలిచిన ఈ ప్రాజెక్టును ఐదేండ్లలోపే పూర్తి చేయడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. 

రైతులు, పరిశ్రమలకు ఊతం

ఈ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వే పశ్చిమ, మధ్య, తూర్పు ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని 12 జిల్లాలను కలుపుతూ.. వాణిజ్యం, వ్యవసాయం, లాజిస్టిక్స్ రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. మెరుగైన రవాణా సౌకర్యాలవల్ల రైతులు తమ పంటలకు మంచి ధర పొందుతారని, వారి ఆదాయం పెరుగుతుందన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 21 విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయని, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తయితే ఈ కనెక్టివిటీ మరింత బలపడుతుందని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణి తయారీలాంటి రక్షణ రంగ ప్రాజెక్టులతో యూపీ దేశానికే వ్యూహాత్మక శక్తిగా మారుతోందని కొనియాడారు.

కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు

ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో బుధవారం ఉదయం 14 కిలోమీటర్ల భారీ రోడ్‌‌‌‌షో నిర్వహించారు. అనంతరం కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రతినిధులు ప్రధానికి త్రిశూలం, ఢమరుకం, సాంప్రదాయ కండువాను బహూకరించారు.