ఆ పార్టీకి ఎప్పటి నుంచో ఉగ్రవాదులతో లింక్

ఆ పార్టీకి ఎప్పటి నుంచో ఉగ్రవాదులతో లింక్

లక్నో: యూపీ మంత్రి ఉపేంద్ర తివారీ శనివారం నాడు ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనల్లో చనిపోయిన, జైళ్లలో ఉన్న వారికి పెన్షన్ ఇస్తామని సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆ పార్టీకి ఎప్పటి నుంచో ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లోని చాలా మంది నేతలు దీర్ఘ కాలం నుంచీ టెర్రరిస్టు సంస్థలతో లింకులు పెట్టుకున్న చరిత్ర ఉందని చెప్పారు.

శుక్రవారం ప్రతిపక్ష నేత అయిన రామ్ గోవింద్ చౌదరి (ఎస్పీ) మాట్లాడుతూ ‘భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడానికి పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పోరాడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలకు, జైళ్ల పాలైన వారికి భవిష్యత్తులో పెన్షన్ ఇస్తాం. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ హామీని నిలబెట్టుకుంటాం’ అని చెప్పారు.

ఈ కామెంట్స్‌పై శనివారం స్పందించిన యూపీ మంత్రి ఉపేంద్ర.. ప్రతిపక్ష ఎస్పీ నేతలు పౌరసత్వ చట్టం విషయంలో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నందుకు ఆ పార్టీ క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.