హేమంత్ సోరెన్ అనర్హతపై నిర్ణయం ప్రకటించండి

హేమంత్ సోరెన్ అనర్హతపై నిర్ణయం ప్రకటించండి

రాంచి: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పై అనర్హత విషయం ఎటూ తేలకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ప్రచారం నేపథ్యంలో గురువారం అధికార యూపీఏ కూటమి (జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ) ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ ను కలిశారు. గవర్నర్ ఆఫీసు నుంచి మీడియాకు వస్తున్న లీకులతోనే రాష్ట్రంలో గందరగోళం నెలకొందని వారు తెలిపారు. సోరెన్ అనర్హత విషయంలో ఎన్నికల సంఘం సిఫారసుపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వెంటనే ప్రకటించాలని కోరుతూ గవర్నర్ కు వారు మెమొరాండం అందజేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సోరెన్ ప్రభుత్వాన్ని అక్రమంగా కూలదోసేలా మీడియాకు లీకులు ఉంటున్నాయంటూ వారు లేఖలో పేర్కొన్నారు. అయితే, తన ఆఫీసు నుంచి లీకులు వచ్చాయన్న ఆరోపణలను గవర్నర్ ఖండించినట్లు కాంగ్రెస్ నేత బంధు టిర్కీ చెప్పారు. సోరెన్ అనర్హత విషయంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని, దీనిపై రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని వెల్లడించారు. 

సోరెన్ రాజీనామా చేయరు.. 

సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తలను కూడా టిర్కీ ఖండించారు. మరోవైపు వచ్చే వారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేత, మంత్రి ఆలంగీర్ ఆలం చెప్పారు. సీఎం సోరెన్ నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే మైనింగ్ లీజును పొడిగించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్యేగా డిస్ క్వాలిఫై చేయాలంటూ గవర్నర్ కు ఎన్నికల సంఘం ఇటీవల సిఫారసు చేసినట్లు వార్తలు రావడం తెలిసిందే. ఈసీ సిఫారసుపై గవర్నర్ అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఇక జార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లు ఉండగా, యూపీఏ కూటమికి 49 మంది (జేఎంఎంకు 30, కాంగ్రెస్ కు 18, ఆర్జేడీకి 1) ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.