పశ్చిమాసియాలో ఉద్రికత్తల మధ్య కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ ను తన దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా హార్ముజ్ జలసంధిని దిగ్భంధించిన విషయం తెలిసిందే. యుద్దం ముగింపు విషయంలో రెండు దేశాల మధ్యతాజా చర్చలు కొంత సఫలం అయినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్, అమెరికా కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఇదేగనక జరిగితే చమురు, గ్యాస్ సరఫరా విషయంలో భారీ ఊరట లభించనుంది.
ప్రపంచ దేశాలకు చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్, అమెరికా కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు అల్ అరబియా వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 28 న ప్రారంభమైన ఇరాన్, అమెరికా యుద్దం తర్వాత హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్భంధించింది. ఆ తర్వాత హార్ముజ్ తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకున్నప్పటికీ అమెరికా తన నౌకలతో హార్ముజ్ జలసంధిలో రాకపోకల జరగకుండా మూసివేసింది. దీంతో సంక్షోభం మళ్లి మొదటికొచ్చింది. తాజా పరిణామాలతో ప్రపచం దేశాలకు ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది.
గురువారం ఉదయం ఇరాన్, అమెరికా యుద్దం ముగింపుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో చర్చలు బాగా నడిచాయి. త్వరలో యుద్దం ముగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్దంముగింపు చర్చల్లో భాగంగా హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చినట్లు అల్ అరబియా వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా పెట్టిన 14 షరతులను ఇరాన్ పరిశీలిస్తున్నామని చెప్పడంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్దం ముగింపుకు ఒక పేజీ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు అమెరికా, ఇరాన్ సుముఖంగా ఉన్నట్లు రాయిటర్స్ కూడా ఇంతకుముందు వెల్లడించింది.
ఒప్పందంలో భాగంగా ఇరాన్ అణు కార్యక్రమాలపై తాత్కాలిక నిషేధం , అమెరికా ఆంక్షలు ఎత్తివేసి, ఇరాన్ కు బిలియన్ డాలర్ల నిధులు విడుదల చేయడం, హార్ముజ్ జలసంధి ద్వారా రవాణాపై ఆంక్షలు ఎత్తివేయడం వంటి షరతులు ఉన్నాయని ఆక్సియోస్ తెలిపింది.
ఇదిలా ఉంటే గురువారం హార్ముజ్ ను తెరిచేందుకు అమెరికా, ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవడంతో టోక్యో నిక్కీ 225 సూచీ 5.7 శాతం లాభపడి ఇంట్రాడేలో రికార్డు స్థాయికి చేరడంతో ఆసియా షేర్లు పుంజుకున్నాయి.
