- పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇతర అంశాలపై 40 నిమిషాల పాటు చర్చ
- ఇరాన్‌తో యుద్ధం మొదలయ్యాక రెండోసారి ఫోన్ చేసిన యూఎస్ ప్రెసిడెంట్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరువురు నేతలూ 40 నిమిషాలపాటు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇంధన భద్రత, కీలక సముద్ర మార్గాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలపై వారు మాట్లాడుకున్నారు.
ఈ విషయంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "నా స్నేహితుడు ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని మేం సమీక్షించాము. అన్ని రంగాలలో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. పశ్చిమాసియాలోని పరిస్థితిపై కూడా మేం చర్చించుకున్నాం. హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షితంగా ఉంచడానికి ఉన్న ప్రాధాన్యతను నొక్కి చెప్పాం" అని మోదీ పేర్కొన్నారు. "మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నామని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. భారత్-, అమెరికా సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి" అని మోదీకి ట్రంప్ ఈ సందర్భంగా చెప్పినట్టు అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా వెల్లడించారు. కాగా, మోదీ, ట్రంప్ మధ్య ఈ ఏడాదిలో ఇది మూడో ఫోన్ సంభాషణ అని అధికారులు తెలిపారు.

