ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం అత్యంత తీవ్రమైన ముప్పు అని కేంద్రహోం మంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని రక్షించడం... ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానమని చెప్పారు. ఢిల్లీలో జరిగిన నో మనీ ఫర్ టెర్రర్ అంతర్జాతీయ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ఉగ్రవాదం కంటే ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం చాలా ప్రమాదకరమని తెలిపారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్, ఆర్థిక నేరాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ ద్వారా ఉగ్రవాదులు వర్చువల్ ఆస్తులను పెంచుకుంటున్నాయని ఆయన తెలిపారు.
ఉగ్రవాదులు ప్రపంచంలో హింసను వ్యాప్తి చేసేందుకు, యువతను తమవైపు ఆకర్షితుల్ని చేసుకుంటున్నారని అమిత్ షా అన్నారు. అందుకు.. ఆర్థిక వనరుల బలోపేతం కోసం నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని చెప్పారు. ఉగ్రకార్యకలాపాలకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా డార్క్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతికి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు దేశ భద్రతా నిర్మాణాన్ని, చట్టపరమైన, ఆర్థికపరమైన వ్యవస్థల్ని బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించామని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ సహా ఉగ్రమూకలకు స్వర్గధామాలుగా నిలుస్తున్న.. పలు దేశాల తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్న దేశాలు.. కొన్ని ఉన్నాయంటూ పరోక్షంగా మండిపడ్డారు. ఉగ్రవాదుల లక్ష్యాలు, కుట్రలను సమర్థంగా అడ్డుకొనేందుకు ప్రపంచ దేశాలన్నీ సమష్టి బాధ్యతతో కృషి చేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా చెప్పారు.

