హైదరాబాద్ సిటీ, వెలుగు: శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో విమానాల రాకపోకలకు లేజర్, స్కై బీమ్, సెర్చ్, మూవింగ్ బీమ్ లైట్లు తీవ్ర సమస్యగా మారాయని, అలా చేయడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే జైలు శిక్ష తప్పదని పోలీసులు, ఎయిర్ పోర్టు ఆఫీసర్లు హెచ్చరించారు. డీసీపీ ఆఫీసులో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ బి.రాజేశ్, జీఎంఆర్ సీఓఓ ఎయిర్ సైడ్ సేఫ్టీ ఆఫీసర్లు అవేర్‌నెస్ మీటింగ్ నిర్వహించారు. దీనికి ఎయిర్‌పోర్టు పరిసరాల్లోని 70 కన్వెన్షన్, ఫంక్షన్ హాళ్లు, బాంకెట్ హాళ్లు, ఫామ్ హౌస్‌ల యజమానులు, నిర్వాహకులు హాజరయ్యారు.
ఆఫీసర్లు మాట్లాడుతూ లేజర్, బీమ్ లైట్ల వాడకం వల్ల ప్లైట్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. ఎయిర్ పోర్టు పరిసరాల్లో వీటి వినియోగం పూర్తిగా నిషేధమని, ఫంక్షన్లు, ఇతర సందర్భాల్లో ఇలాంటి లైట్లు వేయొద్దన్నారు. రూల్స్పాటించకపోతే జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు.
