కట్టిన వారం రోజుల్లోనే  కాళేశ్వరం లీక్..విషయం తెలిసినా, కేసీఆర్ దాచారు..అందుకే మేడిగడ్డ కూలింది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కట్టిన వారం రోజుల్లోనే  కాళేశ్వరం లీక్..విషయం తెలిసినా, కేసీఆర్ దాచారు..అందుకే మేడిగడ్డ కూలింది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • డిజైన్, నిర్మాణ లోపాలతోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు రంధ్రాలు
  • ఇప్పటికీ డేంజర్ జోన్‌లోనే ఆ మూడు బ్యారేజీలు
  • కాంట్రాక్టర్ల నుంచి బీఆర్‌ఎస్‌కు 
  • రూ.1,400 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు
  • ఎన్డీఎస్‌ఏ, పుణె ఏజెన్సీలతో సాయిల్ టెస్టులు చేయించాం
  • రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ పిచ్చి కామెంట్లు
  • ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన వారం రోజుల్లోనే లీక్ అయిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి సహా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పినా నాటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. అందువల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని చెప్పారు.

ఇసుకలో ఫిల్లర్లు వేసి నిర్మించిన మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం డేంజర్ జోన్‌లోనే ఉన్నాయన్నారు. కేవలం హెలికాప్టర్ పర్యటనలో తనకు నచ్చిన చోట కేసీఆర్ బ్యారేజ్‌లు కట్టారన్నారు. ఈ లోప భూయిష్టమైన విధానాలు, డిజైన్లు, నిర్మాణంతోనే కాళేశ్వరం కూలిందన్నారు. అయితే, అంతర్జాతీయ నిపుణులు, ఎన్డీఎస్ఏ సూచనలతో వచ్చే ఏడాది నాటికి ఈ మూడు బ్యారేజీలను రిపేర్లు చేసి, అందుబాటులోకి తెస్తామన్నారు. సుమారు మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఈ ప్రాజెక్టుకు ఏడాదికి దాదాపు16 వేల కోట్ల వడ్డీ కడుతున్నట్లు వెల్లడించారు.

బుధవారం ఢిల్లీలోని  తెలంగాణ భవన్‌లో మంత్రి మీడియాతో చిట్ చాట్ చేశారు. నేషణల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ), పుణెకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నివేదికలు కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన ఈ మూడు బ్యారేజీలు డేంజర్ జోన్‌లో ఉన్నాయని తేల్చిచెప్పాయన్నారు. సరైన సాయిల్ టెస్టింగ్ చేయకుండా ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. బ్యారేజ్ ఫిల్లర్లు, ఇసుక నేలల్లో సీకెంట్ పైల్ ఫౌండేషన్లు వేయాలని నిపుణులు సూచించినా, వాటిని కాదని షీట్ పైల్ ఫౌండేషన్లు వేయడం వల్లే పునాదుల కింద నీరు లీక్ అవుతూ కట్టడాలు కుంగిపోయాయన్నారు.

అలాగే మూడు బ్యారేజీలకు స్టీల్ ఇన్ బేస్(గేట్లు ఎత్తినప్పుడు నీరు భూమి తాకే ప్రాంతం, నీరు పైకి ఉప్పొంగేలా నిర్మించేది) ప్రాపర్‌‌గా లేదన్నారు. ఎన్డీఎస్‌ఏ ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఈ మూడు బ్యారేజీలు ప్రస్తుతం నీటిని నిల్వ చేసే స్థితిలో లేవన్నారు. కేవలం రాజకీయ స్వలాభం కోసమే బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేసి పంపింగ్ చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు మూర్ఖంగా పట్టుబడుతున్నారని మండిపడ్డారు. అలా నీటిని నిల్వ చేస్తే బ్యారేజీలు మొత్తం కొట్టుకుపోయి, దిగువన ఉన్న 40 గ్రామాల్లో జనం చచ్చిపోతే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. 

కిషన్ రెడ్డి మౌనమెందుకు?

కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 24 గంటల్లో విచారణ చేయిస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని మంత్రి ఉత్తమ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు బ్యారేజీలపై విచారణ చేపట్టాలని కోరితే... మొత్తం కాళేశ్వరం అవినీతిపై డిమాండ్ చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందంలో భాగంగానే కేంద్రం సైలెంట్‌గా ఉందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు విషయంలో తప్పుడు నివేదికలు ఇచ్చిన ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్, ఇతర పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.    

బీఆర్ఎస్‌కు బాండ్ల రూపంలో రూ.1,400 కోట్లు

ప్రాజెక్టుల ముసుగులో గత ప్రభుత్వం భారీగా కమీషన్లు దండుకుందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుంచి ఏకంగా రూ.1,400 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్‌ఎస్ వసూలు చేసిందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట కవితనే చెప్పారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టునూ మెఘా కంపెనీకి ఇవ్వలేదని చెప్పారు. ఈ నెల 31న ఎన్‌డీఎస్‌ఏ సమావేశం జరగనుందన్నారు. ఈ మీటింగ్ లో రాష్ట్రం నుంచి అధికారులు పాల్గొంటారని, తాను కూడా అందుబాటులో ఉంటానని చెప్పారు. 

సుప్రీం తీర్పుతో రాష్ట్రానికి మేలు.. 

కేంద్ర పర్యావరణ శాఖ 2021 నాటి ఆఫీస్ మెమోరాండంను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ ప్రాజెక్టులకు మేలు జరగనుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రధానంగాపాలమూరు–రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ కానుందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణాలకు పూర్తి చట్టబద్ధమైన రక్షణ కలిగిందన్నారు. ఇకపై ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుంటే కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఉండవన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వాలంటే కేంద్రం చట్టబద్ధ నోటిఫికేషన్ తేవాల్సిందేనన్నారు. ఇప్పటికే పూర్తయిన లేదా నిర్మాణం కొనసాగుతున్న కీలక ప్రాజెక్టుల పనులకు మాత్రం ఏ అడ్డంకి ఉండదన్నారు. 

మాకు రాజకీయ దురుద్దేశం లేదు..

కాళేశ్వరం విషయంలో తమకు రాజకీయ దురుద్దేశం లేదని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం బ్యారేజీలు పనికిరాకుండా పోయినా, రైతులకు సాగునీరు అందించేందుకు ఇతర మార్గాలపై ఫోకస్ పెట్టామని చెప్పారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండా నేరుగా అన్నారం మీదుగా సుందిళ్లకు, అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసేందుకు డిజైన్లు రూపొందించాలని నిపుణులను కోరినట్లు చెప్పారు.

దేవాదుల ఫేజ్-6 కింద తిరుమలగిరి రిజర్వాయర్ ద్వారా గోదావరి నీటిని వాడుకోవడం, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను వేగవంతం చేసి నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. కాళేశ్వరం విఫలమైనా, గత ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసిందని మంత్రి చెప్పారు.