కేసీఆర్​ కుటుంబానికి ఫీనిక్స్​లో వాటాలు

కేసీఆర్​ కుటుంబానికి ఫీనిక్స్​లో వాటాలు
  • కేసీఆర్​ కుటుంబానికి ఫీనిక్స్​లో వాటాలు
  • సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్త: ఎంపీ ఉత్తమ్​
  • రాష్ట్ర లిక్కర్​ పాలసీ కూడా పెద్ద స్కామే: భట్టి
  • 4 రెట్ల లిక్కర్​ ప్రాఫిట్​ ఎటుపోతోంది: జీవన్​రెడ్డి
  • ఎందుకు ఉలిక్కిపడుతున్నరు: మధు యాష్కీ
  • ఫీనిక్స్ కంపెనీతో తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధాలున్నాయని ఆరోపణ

న్యూఢిలీ, వెలుగు:  ఫీనిక్స్​ కంపెనీ యజమాని సురేశ్‌‌ చుక్కపల్లి కల్వకుంట్ల కుటుంబానికి బినామీ అని పీసీసీ మాజీ చీఫ్​, ఎంపీ ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి ఆరోపించారు. ‘‘ఫీనిక్స్‌‌ కంపెనీలో కేసీఆర్‌‌ కుటుంబ సభ్యులకు కూడా వాటాలు ఉన్నయ్​. ఈ కంపెనీ వ్యవహారాలపై పూర్తి ఆధారాలతో సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్త. పూర్తిస్థాయి విచారణ జరగాలి’’ అని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్‌‌ తదితరులతో కలిసి ఉత్తమ్​ మీడియాతో మాట్లాడారు. హుజూర్‌‌నగర్‌‌  బై పోల్​లో ఫీనిక్స్‌‌ సంస్థ చైర్మన్‌‌ సురేశ్‌‌.. హుజూర్‌‌నగర్‌‌లోని సిమెంట్‌‌ కంపెనీలకు ఫోన్‌‌ చేసి టీఆర్‌‌ఎస్‌‌కు అనుకూలంగా వ్యవహరించాలని బెదిరించారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ఒబేరాయ్‌‌ హోటల్‌‌లో జరిగిన మద్యం పాలసీ తయారీలో ఢిల్లీ సర్కార్​కు సంబంధం లేని వ్యక్తులు పాల్గొన్నారని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.

సీఎస్​ పాత్రపై విచారణ జరగాలి: భట్టి

తెలంగాణ తరహా లిక్కర్​ పాలసీనే ఢిల్లీలో అమలయ్యేలా రూపొందించారని సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క ఆరోపించారు. ఈ పాలసీలో అత్యంత జుగుప్సాకరమైన అవినీతి జరిగిందన్నారు. ఢిల్లీ లిక్కర్​ పాలసీలోనే ఇంత పెద్ద కుంభకోణం జరిగితే... తెలంగాణ లిక్కర్​ పాలసీ కూడా పెద్ద కుంభకోణమేనని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ లిక్కర్ పాలసీపై కూడా కేంద్రం సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. 

చర్యలెందుకు తీసుకోవడం లేదు?: జీవన్​రెడ్డి

ఢిల్లీలో రూ. 500కు దొరికే మద్యం సీసా, తెలంగాణ లో రూ. 2 వేలకు దొరుకుతున్నదన్నారు. నాలుగు రెట్లుగా ఉన్న ఈ ఫ్రాపిట్ ఎక్కడికి పోతున్నదని ఆయన ప్రశ్నించారు. ఈ మార్జిన్ ఎక్కడికి పోతుందో విచారణ జరగాల్సి ఉందన్నారు. ‘‘ఏ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేశారో ఆ లక్ష్యం కనిపించడం లేదు. మద్యం విక్రయాల్లో మాత్రమే ప్రోగ్రెస్ కనిపిస్తున్నది. ఢిల్లీ లిక్కర్‌‌ కుంభకోణంలో కవిత పాత్ర ఉందని ఆరోపిస్తున్న వారు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు” అని ప్రశ్నించారు.  

కరప్షన్​లో కవితకు కాదేదీ అనర్హం: మధు యాష్కీ

అవినీతి సొమ్ము ఏ రూపంలో వచ్చినా తీసుకునేందుకు కవిత సిద్ధమని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు.  ‘‘శ్రీశ్రీ కవిత్వంలో అగ్గిపుల్ల, కుక్కపిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు.. ఎమ్మెల్సీ కవితకు అక్రమ సొమ్ము పోగేయడంలో కాదేదీ అనర్హం’’ అని ఆయన విమర్శించారు. ‘‘నిజామాబాద్ కు చెందిన గండ్ర ప్రేమ్​సాగర్‌‌ కవితకు బినామీగా ఉన్నాడని సీబీఐ చెప్తున్నది. అలాగే, ఫీనిక్స్‌‌ కంపెనీకి తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధాలు ఉన్నాయి” అని ఆయన ఆరోపించారు. టీఆర్​ఎస్​ లీడర్లు ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు.