విష్ణుమూర్తికి.. లక్ష్మీదేవికి పెళ్లి జరిగిన రోజు ఇదే..

విష్ణుమూర్తికి.. లక్ష్మీదేవికి పెళ్లి జరిగిన రోజు ఇదే..

పురాణాల ప్రకారం అక్షయ తృతీయ విశిష్టత ఏంటి? ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? లక్ష్మీదేవికి.. విష్ణుమూర్తికి ఏ రోజు వివాహం అయింది..ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల ఎలాంటి  ఫలితాలు కలుగుతాయి.పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. . 

భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను 2024 మే 10 శుక్రవారం వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకుంటారు. అక్షయ అంటే తరగనిదని అర్థమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.  అక్షయ తృతీయ రోజు పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేస్తుంటారు. గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 

పురాణాలలో అక్షయ తృతీయ ప్రాముఖ్యత 


శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైనది అక్షయ తృతీయ రోజు. మహాలక్ష్మిని...   శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది. ఈ రోజు లక్ష్మీ దేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కలకళలాడుతుందన్నది భక్తులు నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయని పురాణాల్లో రుషి పుంగవులు పేర్కొన్నట్లు పండితులు చెబుదతున్నారు.  

ఈ విషయాన్ని పార్వతీదేవికి.. శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం చెపుతోందని ఆధ్యాత్మిక వేత్తల ద్వారా తెలుస్తోంది. ఈ రోజున( మే 10)  దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతోందని చిలకమర్తి తెలియచేశారు. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి.

ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి. నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేది. నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగరమథనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే!

నరసింహ స్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది ఈ రోజే కాబట్టే అక్షయ తృతీయ నాడు రాహుకాలాలూ వర్జ్యం వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే! అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.

అక్షయ తృతీయ రోజున సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది. ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. ఆ రోజు ఓ కొత్తకుండలో గానీ, కూజాలో గానీ మంచినీరు పోసి దాహార్తులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలలోనైనా మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు.

ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్లకపోవడం ఎంతో శ్రేయస్కరం. అక్షయతృతీయ అదృష్టాన్ని విజయాన్ని చేకూర్చుతుందని పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకార్యాన్ని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయతృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి, అ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని  ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

మే 10న ఇవి దానం చేయండి 

  • అతిథులకు, అభ్యాగలకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజూ ఆకలితో మనం అలమటించాల్సిన రోజు రాదు. 
  • వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. 
  • బ్రాహ్మణులకు  స్వయంపాకం, దక్షిణ, తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తరజన్మలలో వాటికి లోటురాదు.
  •  గొడుగులు, చెప్పులు, విసనకర్రల వంటివి దానం చేసుకోవచ్చు.