బల పరీక్ష నిర్వహించండి.. గవర్నర్ కు దుష్యంత్ చౌతాలా లేఖ

బల పరీక్ష నిర్వహించండి.. గవర్నర్ కు దుష్యంత్ చౌతాలా లేఖ


హర్యానాలో బీజేపీ సర్కారు సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే.  ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సీఎం నయాబ్ సింగ్ సైనీ సర్కార్ కు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు.   ఈ క్రమంలో  రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్‌ దుష్యంత్ చౌతాలా గురువారం హర్యానా గవర్నర్‌కు లేఖ రాశారు. 

ఒకవేళ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.   అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే తాము బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ఇప్పటికే ​దుష్యంత్​ చౌతాలా తెలిపారు.   బీజేపీ సర్కారును గద్దె దించే ప్రయత్నం చేస్తే .. మేం బయటనుంచి తప్పకుండా కాంగ్రెస్  పార్టీకి  మద్దతు ఇస్తామని చౌతాలా తెలిపారు. 

మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వానికి ఢోకా లేదని, తమ ప్రభుత్వం పటిష్టంగా ఉందని సీఎం సైనీ చెప్పారు. ఎన్నికల వేళ బీజేపీ సర్కారు మైనారిటీలో ఉన్నదని ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్​ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్​లో ఉన్నారని, బీజేపీ సర్కారుకు ఎలాంటి ప్రమాదం లేదని మాజీ సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​ తెలిపారు.  

స్వతంత్ర ఎమ్మెల్యేలు ముగ్గురు సోంబీర్​ సాంగ్వాన్​ (దాద్రి), రన్​దీర్​ సింగ్​ గొల్లెన్​ (పుండ్రి), ధరమ్​పాల్​ గొండేర్ (నిలోఖేరీ) మంగళవారం బీజేపీకి తమ మద్దతు ఉపసంహరించుకున్నారు.  90 మంది సభ్యులన్న హర్యానా అసెంబ్లీలో ఎన్టీఏకు 42 (బీజేపీ 40, హెచ్ఎల్పీ 1, ఇండిపెండెంట్ 1)ఉన్నారు.  నయాబ్ సైనీ ప్రభుత్వంలో ప్రస్తుతం 44 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.  మేజిక్ ఫిగర్ కు ఇంకా 4 సీట్లు కావాల్సి ఉంది.