డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. యాత్ర షురూ అయిన నాటి నుంచి ఇప్పటివరకు 31 లక్షలకు పైగా యాత్రికులు పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ యాత్ర సీజన్‌లో వివిధ కారణాల వల్ల 161 మంది భక్తులు మృతి చెందినట్లు ఆదివారం అధికారులు వెల్లడించారు.
రాష్ట్ర అత్యవసర కార్యాచరణ కేంద్రం (స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్) తాజా నివేదిక ప్రకారం.. ఏప్రిల్ 22న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కేదార్‌నాథ్ ధామ్‌ను అత్యధికంగా 11,05,676 మంది యాత్రికులు సందర్శించారు. బద్రీనాథ్ ధామ్ (ఏప్రిల్ 23 నుంచి) 9,08,619 మంది, గంగోత్రి ఆలయానికి 5,28,406 మంది, యమునోత్రి ఆలయానికి 5,07,421 మంది, శ్రీ హేమకుండ్ సాహిబ్‌కు 55,411 మంది యాత్రికులు వచ్చారు.
శనివారం ఒక్కరోజే 5,511 వాహనాల్లో 61,262 మంది యాత్రికులు పుణ్యక్షేత్రాలకు చేరుకున్నారు. కాగా, ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి యాత్ర మార్గాల్లో మొత్తం 2,89,918 వాహనాలు నడిచినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 19 నుంచి ఇప్పటివరకు యాత్రికులలో 161 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
