V6 News

కోయంబత్తూర్ జిల్లాలోని...లోయలో పడ్డ వ్యాన్.. 9 మంది మృతి

కోయంబత్తూర్ జిల్లాలోని...లోయలో పడ్డ వ్యాన్.. 9 మంది మృతి
  •     తమిళనాడులో ఘోర ప్రమాదం
  •     మృతుల్లో ఏడుగురు మహిళలే..

వాల్పారై (తమిళనాడు): తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా వాల్పారై ఘాట్ రోడ్డులో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. కేరళకు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి లోయలో పడి 9 మంది దుర్మరణం చెందారు. డ్రైవర్ సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 13 మంది పర్యాటకులు వాల్పారై విహారయాత్రకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

వాల్పారై -పొల్లాచ్చి కొండ మార్గంలోని 13వ హెయిర్‌‌పిన్ బెండ్ వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ రక్షణ గోడను ఢీకొట్టి అగాధంలోకి దూసుకెళ్లింది. వ్యాన్ లోయలో పడడంతో నుజ్జునుజ్జు అయ్యింది. 8 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా ఒకరు హాస్పిటల్​లో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు. ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరంతా మలప్పురంలోని ఓ స్కూల్​కు చెందిన టీచర్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుంచి డెడ్​బాడీలను వెలికి తీసి గాయపడిన వారిని పొల్లాచ్చి గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కోయంబత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. " కోయంబత్తూరులో జరిగిన ప్రమాద వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.