- ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల వల్లే వనమహోత్సవం ఆలస్యం
- క్షేత్రస్థాయిలో ‘స్పెషల్ ప్లాంటేషన్ డ్రైవ్’ : గ్రామీణాభివృద్ధిశాఖ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ‘వనమహోత్సవం’ కార్యక్రమాన్ని స్పీడప్ చేసినట్లు గ్రామీణావృద్ధిశాఖ పేర్కొంది. జూన్, జులై తొలి వారాల్లో ‘ఎల్‌నినో’ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు, తీవ్ర పొడివాతావరణం ఏర్పడిందని, ఆ సమయంలో మొక్కలు నాటితే ఎండిపోయి ప్రజాధనం, కూలీల శ్రమ వృథా అవుతుందనే వన మహోత్సవం కార్యక్రమంలో కొంత వేగం తగ్గించామని పేర్కొన్నారు. బుధవారం ‘వీ6 వెలుగు’ పేపర్ లో ప్రచురితమైన కథనానికి గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసర్లు స్పందించారు. కొన్ని రోజులుగా రాష్ట్రమంతటా విస్తారమైన వర్షాలు కురుస్తుండడంతో నేలలో తేమ పెరిగి, మొక్కలు నాటడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని పేర్కొన్నారు.
2026-27 సంవత్సరానికి గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించిన 6.18 కోట్ల మొక్కల లక్ష్యంలో ఇప్పటివరకు 2.59 కోట్ల మొక్కలు నాటగా.. ఆగస్ట్ చివరి నాటికి 100 శాతం మొక్కలు నాటుతామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ నర్సరీల్లో లక్ష్యానికి తగినట్లుగా మొక్కలు రెడీగా ఉన్నాయని గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.
పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు, జిల్లా గ్రామీణాభివృద్ధి ఆఫీసర్లను సమాయత్తం చేసి ‘స్పెషల్ ప్లాంటేషన్ డ్రైవ్’ ప్రారంభించినట్లు పేర్కొంది. ఆగస్టు నాటికి మొక్కలు నాటే ప్రక్రియతో పాటు ప్రతిపాదిత 59.52 లక్షల పనిదినాల లక్ష్యాన్ని కూడా పూర్తి చేస్తామని ఆఫీసర్లు తెలిపారు.
