‘వందేమాతరం’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం.. గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు, జరిమానా

‘వందేమాతరం’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం.. గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు, జరిమానా
  • ఇక జాతీయ గీతంతో సమాన హోదా
  • గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలు, జరిమానా లేదా రెండూ విధించే చాన్స్

న్యూఢిల్లీ: జాతీయ గేయం వందేమాతరాన్ని అవమానించడం శిక్షార్హమైన నేరంగా ప్రకటించే బిల్లుకు లోక్‌‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఇప్పటికే రాజ్యసభ ఆమోదించిన ఈ బిల్లును లోక్‌‌సభ కూడా వాయిస్‌‌ ఓట్‌‌తో పాస్​చేసింది. దీంతో వందేమాతరానికి జాతీయ గీతం ‘జనగణమన’తో సమాన హోదా కల్పించే మార్గం సుగమమైంది. ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌‌సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్‌‌మెంట్) బిల్–2026పై లోక్‌‌సభలో స్వల్ప చర్చ జరిగింది. 

అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ 76 ఏళ్ల పాలనలో వందేమాతరానికి గౌరవం ఇవ్వకుండా బుజ్జగింపు రాజకీయాలు చేసిందని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం ఇప్పుడు జాతీయ గేయానికి తగిన గౌరవం కల్పిస్తోందన్నారు. “ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్ కోసం వందేమాతరం మొత్తం ఆరు చరణాలు అవసరం” అని పేర్కొంటూ తన ప్రసంగాన్ని “వందేమాతరం” నినాదంతో ముగించారు. 

అనంతరం బిల్లును వాయిస్ ఓట్‌‌తో ఆమోదించారు. ప్రతిపక్షం ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది. బిల్లు ఆమోదం తర్వాత డీఎంకే ఎంపీ ఏ. రాజా బిల్లు పత్రాలను చించి సభలో విసిరేయగా, నినాదాల మధ్య లోక్‌‌సభను రోజంతా వాయిదా వేశారు. పస్తుతం అమల్లో ఉన్న ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌‌సల్ట్స్ టు నేషనల్ హానర్ చట్టం’ ప్రకారం జాతీయ గీతం జనగణమన ఆలాపనను  అడ్డుకోవడం నేరం. దీనికి మూడేళ్ల వరకు జైలు, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

 రెండోసారి అదే నేరం చేస్తే కనీసం ఏడాది జైలు శిక్ష తప్పనిసరి. తాజా సవరణతో ఇదే నిబంధనలు వందేమాతరం గేయానికి కూడా వర్తిస్తాయి. మరోవైపు డీఎంకే ఎంపీ కనిమొళి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దేశభక్తి పేరుతో తీసుకొచ్చిన “హిందుత్వ అజెండా” అని ఆరోపించారు.