రంగస్థలంపై మొదలెట్టి.. రంగుల ప్రపంచంపై ముద్ర వేసి..

రంగస్థలంపై మొదలెట్టి.. రంగుల ప్రపంచంపై ముద్ర వేసి..

విలక్షణ పాత్రలు పోషించే మేటి నటుడు..అక్షరాల్ని అలవోకగా పరుగులు పెట్టించే రచయిత. సినీ చరిత్రలో సగర్వంగా నిలిచిపోయే సినిమా తీసిన దర్శకుడు. ప్రతివారినీ తనవాళ్లుగా భావించే హితుడు, స్నేహితుడు. ఇన్ని గొప్ప లక్షణాలున్న తనికెళ్ల భరణి అందరిలాంటి వారు కాదు. ఎందరిలోనే ఒకే ఒక్కడుగా పేరు తెచ్చుకున్న ప్రతిభాశాలి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా భరణి జీవిత పుస్తకంలోని కొన్ని పేజీల్ని ఓసారి తిరగేద్దాం.

నాటకమంటే ప్రాణం

1956, జులై 14న సికింద్రాబాద్‌లో  జన్మించారు తనికెళ్ల భరణి. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా అయినా తల్లిదండ్రులు భరణి పుట్టకముందే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. బీకాం చదివిన ఆయన.. చిన్నతనంలోనే పురాణాలను అవపోసన పట్టారు. నాటకాలపై మక్కువ పెంచుకున్నారు. చదువుకునే రోజుల్లోనే ‘అద్దె కొంప’ అనే నాటకాన్ని రాసి ప్రదర్శించి మొదటి బహుమతి అందుకున్నారు. దీంతో రచనపైన, నాటకాలపైన ఇష్టం మరింత పెరిగింది. రాళ్లపల్లితో పరిచయం ఆయన్ని ఆ దిశగా మరింత ప్రోత్సహించింది. నాటకాలకు డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేశారు. థియేటర్ ఆర్ట్స్ లో డిప్లొమా పూర్తి చేశారు. నాటకమంటే ఆయనకి ప్రాణం. ఆ రంగంలో ఓ వెలుగు వెలిగాక.. తన గురువు రాళ్లపల్లి సాయంతో చెన్నై వెళ్లి, సినిమాలకు పని చేసే అవకాశం సంపాదించారు. దాంతో ఆయన జీవితం మరో మలుపు తిరిగింది. 

కలమే మొదటి బలం

వంశీ డైరెక్ట్ చేసిన ‘కంచు కవచం’. రచయితగాను, నటుడిగాను ఇండస్ట్రీకి ఒకేసారి పరిచయమయ్యారు భరణి. నటుడిగా కంటే రచయితగానే మంచి మార్కులు పడ్డాయి తనకి. మెల్లగా నటుడిగా పుంజుకున్నప్పటికీ, రచయితగా ఆయన ముద్ర తెలుగు సినిమాపై కనిపిస్తూనే ఉంది. కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, లాయర్ సుహాసిని, సంకీర్తన, వారసుడొచ్చాడు, చిన్నారి స్నేహం, స్వరకల్పన, వింతదొంగలు, శివ, చెవిలో పువ్వు, చెట్టు కింద ప్లీడర్, నారీ నారీ నడుమ మురారి, బలరామకృష్ణులు, మొండి మొగుడు పెంకి పెళ్లాం తదితర చిత్రాలు భరణిలోని రచనా పటిమని సంపూర్ణంగా వెలికి తీశాయి. అయితే ఆయన పెన్ పవర్ సినిమాల దగ్గరే ఆగిపోలేదు. ఓవైపు నాటకాలు, సినిమాలకు రాస్తూనే ఆధ్మాత్మిక గ్రంథాలు రచించారు. నక్షత్ర దర్శనం, ఎందరో మహానుభావులు తదితర పుస్తకాలు కూడా రాశారు.

విలక్షణ పాత్రలకు కేరాఫ్

దాదాపు 800 సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలు పోషించారు భరణి. కెరీర్ ప్రారంభంలో కమెడియన్‌గా నవ్వించారు. ఆ తర్వాత విలన్ వేషాలు వేశారు. మెల్లగా సపోర్టింగ్‌ రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఏది చేసినా అందులో ఆయన మార్క్  ఉండాల్సిందే. అయితే ఆయనలోని వర్సటాలిటీని బైటికి తీసింది, కెరీర్‌‌ని మలుపు తిప్పింది మాత్రం ‘శివ’. అందులో ఆయన చేసిన నానాజీ పాత్ర మంచి పేరు తెచ్చింది. ఇన్నేళ్లయినా భరణి బిజీగానే ఉండటానికి కారణం.. ఏదో ఒక శైలికి కట్టుబడిపోకపోవడమే. విలనీలో ఒక రకంగా.. బాబాయ్, తండ్రి  పాత్రల్లో మరో రకంగా.. కామెడీ క్యారెక్టర్స్ లో ఇంకో రకంగా యాక్ట్ చేస్తుంటారాయన. శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్‌, యమలీల చిత్రాల్లో  కడుపుబ్బ నవ్వించినా.. ‘ఆమె’ లాంటి సినిమాల్లో క్రూరంగా భయపెట్టినా.. మన్మథుడు, టెంపర్‌‌ సినిమాల్లో ఎమోషన్స్ తో మనసుల్ని తాకినా.. ఆ క్రెడిట్ భరణికే చెల్లింది. ‘ఆమె’ సినిమాలో హీరోయిన్‌ని వేధించే బావగా చేసిన తర్వాత ఎంతోమంది మహిళలు భరణిని చూసి నిజంగా భయపడేవారట. సొంత మరదలు కూడా మాట్లాడటం మానేశారంటే ఆయన పాత్రలో ఎంతగా లీనమైపోతారో అర్థం చేసుకోవచ్చు!   తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ నటించిన భరణి.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రెండుసార్లు నంది అవార్డులు అందుకున్నారు. మరో నంది ఆయనలోని రచయితని వరించింది.

సర్వం శివుడే!

భరణి శివభక్తుడు. సర్వం శివుడే అని నమ్ముతారు. తెలంగాణ యాసలో ఆయన శివస్తుతి చేస్తుంటే వినేవారి మనసు పులకరిస్తుంది. అందుకే ఆయన ‘శబ్బాష్‌రా శంకరా’ పేరుతో రాసిన పద్యాలకు అంత ఆదరణ దక్కింది. ‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్.. చిటికెడు బూడిద పోస్తే బస్.. వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా.. శబ్బాష్‌రా శంకరా’ అంటారు ఓ పద్యంలో. ‘కన్నీళ్లల్ల నే బుట్టినా పెరిగినా.. కన్నీళ్లనే కాలినా.. ఒక్క బొట్టన్నా స్ఫటిక లింగమైతే.. శబ్బాష్‌రా శంకరా’ అంటారు మరో చోట. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఇంత గొప్పగా శివతత్వాన్ని బోధించడం భరణికే చెల్లింది. బేసిగ్గా ఆయనకి తెలంగాణ యాసంటే చాలా ఇష్టం. తెలంగాణ యాసను, నైజాం భాషను ఎలా పలకాలో తెలియక సినిమాల్లో వ్యంగ్యంగా వాడేస్తున్నారని అంటుంటారాయన. ఇక ‘నాలోన శివుడు కలడు’ అంటూ భరణి రాసిన పాటలు ఎన్నో శివాలయాల్లో రోజూ వినిపిస్తూనే ఉంటాయి. 

దర్శకుడిగా మంచి మార్కులు

‘మిథునం’ సినిమాతో దర్శకుడిగానూ సత్తా చాటారు భరణి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఒక క్లాసిక్. ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు దక్కాయి. ఇలా ఎన్నో రకాలుగా తన ప్రతిభతో తెలుగువారిని దశాబ్దాలుగా అలరిస్తూ వస్తున్నారు భరణి. మంచి వ్యక్తిగానూ ప్రశంసలు పొందుతూ ఉన్నారు. ఆయన భార్య దుర్గాభవాని. వారికి ఇద్దరు పిల్లలు తేజ, సౌందర్య లహరి. తేజ ‘మిస్టర్ లవంగం’ సినిమాతో యాక్టర్‌‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఫ్యామిలీ మేన్‌గా.. మంచి మనిషిగా.. గొప్ప నటుడిగా.. అంతకంటే గొప్ప రచయితగా శభాష్‌ అనిపించుకున్న భరణి మరిన్ని సంవత్సరాలు సక్సెస్‌ఫుల్‌ జర్నీ కొనసాగించాలని కోరుకుంటూ.. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.