- 18 లక్షల మంది అర్హులుంటే.. కార్డులు తీసుకున్నది 27 వేలే
- అవగాహన కల్పించడంలో ఆఫీసర్లు విఫలం.. 2 శాతం కూడా దాటని రిజిస్ట్రేషన్లు
- స్కీమ్‌పై అనుమానాలు ఎన్నో.. క్లారిటీ లేక వృద్ధుల పాట్లు
- ఆరోగ్య మిత్ర, మీసేవా సిబ్బందికి కూడా అవగాహన శూన్యం
- ప్రచారం, అవగాహనలేమితో వృద్ధులకు అందని ఆరోగ్య భద్రత
హైదరాబాద్, వెలుగు: డెబ్బై ఏండ్లు నిండిన వృద్ధులకు ఉచిత వైద్యం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వయో వందన స్కీమ్ అమలు రాష్ట్రంలో నత్తనడకన సాగుతోంది. నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) లెక్కల ప్రకారం రాష్ట్రంలో 70 ఏండ్లు పైబడిన వారు 18 లక్షల మందికి పైనే ఉన్నారు. కానీ, స్కీమ్ ప్రారంభమై ఏడాదికి పైగా అవుతున్నా.. ఇప్పటివరకు ఎన్‌రోల్ అయ్యింది కేవలం 27,566 మందే. అంటే అర్హులైన వారిలో కనీసం 2 శాతం మందికి కూడా ఇంకా కార్డులు అందలేదు. ఈ స్కీమ్ ద్వారా ఇప్పటివరకు ఎంత మంది చికిత్స పొందారో కూడా చెప్పడానికి అధికారులు ఇష్టపడటం లేదు.
సెక్రటేరియెట్, మున్సిపల్ ఆఫీసుల వద్ద కనీసం ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో.. అసలు ఇలాంటి స్కీమ్ ఒకటి ఉందన్న సంగతే జనానికి తెలియడం లేదు. కేవలం ట్విట్టర్‌లో, ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తే వృద్ధులకు ఎలా తెలుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెన్షన్ల పంపిణీ సమయంలోనే వృద్ధుల వివరాలు సేకరించి, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేయిస్తేనే పేదలకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సిబ్బందికే అవగాహన ఉండట్లేదు..
వయో వందన స్కీమ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి హాస్పిటల్స్‌లోని ఆరోగ్య మిత్ర, మీ సేవా సెంటర్ల వద్దకు వెళితే.. అక్కడి సిబ్బందికి కూడా ఈ స్కీమ్‌పై అవగాహన ఉండటం లేదు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్య మిత్ర సిబ్బంది వయో వందన రిజిస్ట్రేషన్ చేయడానికి నిరాకరిస్తున్నారు. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కూడా రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు వస్తున్నాయి.
ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ లింక్ లేకపోవడం, సిబ్బందికి రిజిస్ట్రేషన్‌పై అవగాహన లేకపోవడం కూడా కారణం అవుతుంది. దీనిపై ఆరోగ్యశ్రీ అధికారులు స్పందిస్తూ.. ఆరోగ్య మిత్ర సిబ్బందికి వయోవందన స్కీమ్‌పై అవగాహన కల్పించామని, రిజిస్ట్రేషన్ కోసం.. వచ్చేవారికి సహకరించి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పామన్నారు.
ఏదో ఒకటే పని చేస్తుంది...
రిజిస్ట్రేషన్లు తగ్గడానికి ఆఫీసర్లు కూడా మరో కారణం చెబుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. వయో వందనలో చేరితే ఆరోగ్యశ్రీ నుంచి ఎగ్జిట్ కావాల్సి వస్తుందేమోనన్న భయం, దీని లిమిట్ రూ.5 లక్షలే ఉండటంతో జనం వెనకడుగు వేస్తున్నారని అంటున్నారు. అయితే, ఏ స్కీమ్ పరిధిలో లేని మధ్యతరగతి వృద్ధులు దాదాపు 3 లక్షల మంది ఉన్నారని, కనీసం వారికైనా అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.
సీజీహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్, ఈహెచ్ఎస్ కార్డులు ఉన్నవారు.. పాత కార్డునైనా ఉంచుకోవాలి, లేదా అది వదులుకొని వయో వందనకైనా రావాలి. గవర్నమెంట్ స్కీమ్స్‌లో అన్-లిమిటెడ్ కవరేజీ ఉంటుంది కాబట్టి, వారు పాత దాంట్లోనే కొనసాగడం బెటరని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు ఇన్సూరెన్స్ ఉన్నవారు మాత్రం నిరభ్యంతరంగా ఈ కార్డు తీసుకోవచ్చని చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి..
ఆదాయం, కులం, మతంతో సంబంధం లేకుండా 70 ఏండ్లు నిండిన వృద్ధులందరూ https://beneficiary.nha.gov.in/లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరి. స్మార్ట్ ఫోన్ వాడకం రానివారు, టెక్నికల్ సమస్యలు ఉన్నవారు నేరుగా దగ్గర్లోని ప్రభుత్వ హాస్పిటల్‌కు గానీ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ గానీ వెళ్తే.. అక్కడున్న ఆరోగ్య మిత్రలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారు.
కేంద్ర పోర్టల్‌లో రిజిస్టర్ కాగానే ఆ వివరాలు ఆటోమేటిక్‌గా రాష్ట్ర ప్రభుత్వ రాజీవ్ ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో అప్‌డేట్ అవుతాయి. లబ్ధిదారులకు ప్రత్యేకమైన వయో వందన యోజన ఐడీ జనరేట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
