V6 News

వీరప్పన్ బిడ్డకు బీజేపీలో కీలక పదవి

వీరప్పన్ బిడ్డకు బీజేపీలో కీలక పదవి

ఏనుగు దంతాలు, గంధపు చెక్కల స్మగ్లింగ్.. అడ్డొచ్చిన పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్ల హత్యలతో కొన్నేళ్ల పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేసిన వీరప్పన్ 2004లో ఎన్‌కౌంటర్‌లో మరణించడం అటవీ స్మగ్లింగ్ హిస్టరీలో ఓ సంచలనంగా నిలిచింది. అంతటి గజదొంగగా టెర్రర్ పుట్టించిన ఆ వ్యక్తికి కుమార్తె సమాజ సేవ చేస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే వేగంగా ఉన్నత స్థానానికి ఎదడగం విశేషం. న్యాయ విద్య పూర్తి చేసిన వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్ కొన్నేళ్లుగా తమిళనాడులో ఓ స్కూల్ స్థాపించి పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారామె. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి నెలలో బీజేపీలో చేరగా.. కొద్ది నెలల్లోనే ఆమెను మంచి పదవి వరించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమించింది బీజేపీ. పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వీరప్పన్ వర్గానికి ప్రజల్లో మంచి పట్టుందని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఆయా ప్రాంతాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.

వీరప్పన్‌ను లైఫ్‌లో ఒక్కసారే చూశా.. ప్రజా సేవ చేయమని చెప్పాడు

తాను ఏదో ఒక కులానికో, వర్గానికో ప్రతినిధిగా గుర్తింపు పొందాలని అనుకోవడం లేదని, తాను మానవత్వాన్ని నమ్ముతానని చెప్పారు విద్య. సమాజ సేవ చేసేందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టాని అన్నారు. ఆమె బీజేపీ స్టేట్ యూత్ వింగ్ వైస్‌ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అందుకున్న విషయాన్ని తన ఫేస్‌బుక్ వేదికగా ఆమె పంచుకున్నారు. అయితే నెటిజన్లంతా ఆమె తండ్రి వీరప్పన్ గురించే కామెంట్ చేస్తుండడంతో ఈ సందర్భంగా విద్య మాట్లాడుతూ తాను ఆయనను జీవితంలో ఒక్కసారి మాత్రమే చూశానని చెప్పారు. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు వేసవి సెలవుల్లో కర్ణాటకలోని గోపీనాథం గ్రామంలోని తాతయ్య దగ్గర ఉండగా.. ఒక్కసారి వీరప్పన్ వచ్చాడని, స్నేహితులతో ఆడుకుంటుండగా తన దగ్గరకు వచ్చి కొద్ది నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయాడని తెలిపారు. బాగా చదువుకుని డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలని చెప్పాడని అన్నారు విద్య. తనకు బాగా ఊహ తెలిసేటప్పటికి ఆయన పరిస్థితుల కారణంగా తప్పుడు దారిలోకి వెళ్లాడని తెలిసిందని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో సమాజ సేవ చేస్తున్నాడని ఆయన గురించి స్ఫూర్తిదాయక విషయాలూ విన్నానని అన్నారామె.