- పీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ వీర్లపల్లి శంకర్
హైదరాబాద్, వెలుగు: రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓబీసీ వర్గాలన్నింటినీ సంఘటితం చేసి, కాంగ్రెస్ పార్టీకి బలమైన శక్తిగా తీర్చిదిద్దుతామని పీసీసీ ఓబీసీ సెల్ తీర్మానించింది. బుధవారం ఇందిరా భవన్‌లో పీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయమైన ‘సామాజిక న్యాయం’ లక్ష్యాన్ని గడపగడపకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిల్లో ఓబీసీ సెల్ కమిటీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలోనే తెలంగాణ ఓబీసీ సెల్‌ను ముందు వరుసలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
