V6 News

రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్రెడ్డి, సింఘ్వీ ప్రమాణం

రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్రెడ్డి, సింఘ్వీ ప్రమాణం

హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు
అనంతరం శాలువా కప్పి సన్మానించిన మంత్రులు సీతక్క, వివేక్, పొంగులేటి, వాకిటి

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ నుంచి ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ ప్రమాణం చేశారు. గురువారం రాజ్యసభలో చైర్మన్ సీపీ రాధాకృష్ణన్  వారితో ఎంపీలుగా ప్రమాణం చేయించారు. తొలుత అభిషేక్ మను సింఘ్వీ హిందీలో ప్రమాణం చేశారు. అనంతరం వేం నరేందర్ రెడ్డి ఇంగ్లీష్​లో ప్రమాణం చేశారు. తెలంగాణతో పాటు అస్సాం, బిహార్, హర్యానా, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిసా, మహారాష్ట్ర నుంచి కొత్తగా ఎన్నికైన నేతలతో  రాజ్యసభ చైర్మన్ ఎంపీలుగా ప్రమాణం చేయించారు.

ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, శివేశ్ కుమార్(బీజేపీ), ఉపేంద్ర కుష్వాహా(ఆర్ఎల్ఎం), రాంనాథ్ ఠాకూర్(జేడీయూ), అస్సాం నుంచి తేరాశ్​ గోవల్ల(బీజేపీ), జొజెన్ మోహన్(బీజేపీ), ప్రమోద్ బోరో(యూపీపీ–ఎల్), చత్తీస్ గఢ్​ నుంచి లక్ష్మీ వర్మ(బీజేపీ), దేవి నేతం(కాంగ్రెస్), హర్యానా నుంచి కరంవీర్ సింగ్ బోధ్ (కాంగ్రెస్), సంజయ్ భాటియా (బీజేపీ), హిమాచల్ ప్రదేశ్ నుంచి అనురాగ్ శర్మ ( కాంగ్రెస్), మహారాష్ట్ర నుంచి వినోద్ శ్రీధర్ తావ్డే (బీజేపీ), ఒడిసా నుంచి సుజీత్ కుమార్ (బీజేపీ)లు రాజ్య సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. నూతన సభ్యులకు చైర్మన్  రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు.  

హాజరైన సీఎం, మంత్రులు

ప్రమాణస్వీకారానికి ముందు కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ చైర్​పర్సన్​ శ్రీమతి సోనియా గాంధీని వేం నరేందర్​రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు సోనియా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకట స్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, సురేశ్ షెట్కార్​ హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, కార్పొరేషన్​ చైర్మన్లు, ఇతర నేతలు వీఐపీ గ్యాలరీ నుంచి ప్రమాణోత్సవ కార్యక్రమాన్ని చూశారు. అనంతరం సీఎం సమక్షంలో మంత్రులు సీతక్క, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి, వాకిటి, ఎంపీలు, ఇతర నేతలు వేం నరేందర్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ హక్కుల కోసం పోరాడుతా

తెలంగాణ హక్కులు, నిధుల గురించి పార్లమెంట్ లో పోరాడతా. నాపై కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా. తెలంగాణ వికాసం, అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తాను. రాజ్య సభ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించిన సోనియా, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలతోపాటు ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ఎంపీ వేం నరేందర్​రెడ్డి