తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే..పవన్ కల్యాణ్ పై వెన్నెల గద్దర్ ఫైర్

తెలంగాణ గడ్డ మా అయ్యల జాగీరే..పవన్ కల్యాణ్ పై వెన్నెల గద్దర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు:  ‘తెలంగాణ గడ్డ నిన్న, నేడు, రేపు ఎప్పటికీ మా అయ్యల జాగీరే’ అని వెన్నెల గద్దర్ స్పష్టం చేశారు. పైసలు పంచితేనో, లాబీయింగ్  చేస్తేనో తెలంగాణ రాలేదన్నారు. తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్  చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బుధవారం ఆమె వీడియో రిలీజ్ చేశారు. ‘నటుడిగా, గద్దర్  అభిమానిగా పవన్ కల్యాణ్ ను తెలంగాణ ప్రజలు అభిమానిస్తారు. తెలంగాణ ఆవిర్భావం రోజు తెలంగాణపై మీరు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఆడబిడ్డగా తీవ్రంగా ఖండిస్తున్నాను. సినిమాల్లో నటిస్తే, పొత్తులకు వెళ్తే తెలంగాణ రాలేదు, తెలంగాణ పోరాటం అనేది సాయుధ పోరాటం లాంటిది. 

తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్ కౌంటర్  చేశారు. ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ పిల్లల్ని కోల్పోయారు. రక్తం చిందించిన గడ్డగా నిలబడ్డాం. తెలంగాణ బిడ్డల త్యాగాల, ఆత్మగౌరవ పోరాట ఫలితమే ప్రత్యేక రాష్ట్రం. తమను తాము ఆహుతి చేసుకున్న శ్రీకాంతచారే తెలంగాణ ఏర్పాటుకు సాక్ష్యం’ అని ఆమె గుర్తు చేశారు.