V6 News

ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. టైరు పగిలి లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు సజీవ దహనం

ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం.. టైరు పగిలి లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు సజీవ దహనం

హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. భర్వైన్-హోషియార్‌పూర్ రహదారి.. పదునైన మలుపులు, ఏటవాలు ప్రాంతాలకు ఈ రోడ్డు పెట్టింది పేరు.  ఏప్రిల్ 28 (మంగళవారం )ఇదే మార్గంలో ప్రయాణిస్తున్న మారుతి స్విఫ్ట్ కారు, ఒక్కసారిగా లోయలో పడిపోయింది. పడిపోయిన వెంటనే కారులో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా కాలి బూడిదయ్యింది.

ప్రమాదానికి కొద్దిసేపటి ముందు పెద్ద శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టైరు పగలడం వల్లే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే  కారు ఎంత వేగంతో ఉందో అర్థమవుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు  అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి పరిస్థితి భీభత్సంగా మారింది. ఒక మృతదేహం కారు బయట పడి ఉండగా, మరొకటి కారు శిథిలాల మధ్య కాలిపోయిన స్థితిలో లభ్యమైంది. ప్రమాదానికి గురైన కారు పంజాబ్‌లోని లూధియానాకు చెందినదిగా గుర్తించారు. మృతులు మాతా చింతపూర్ణి ఆలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ విషాదం నెలకొంది. లభించిన ఆధార్ కార్డు ఆధారంగా బాధితులు లూధియానా వాసులని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.