15 రోజుల పనికి ‘ఇదిగో నీ కూలీ డబ్బులు’ అని రూ. 200 చేతిలో పెట్టారు.. వీడియో వైరల్ !

15 రోజుల పనికి ‘ఇదిగో నీ కూలీ డబ్బులు’ అని రూ. 200 చేతిలో పెట్టారు.. వీడియో వైరల్ !

రాంచీ: జార్ఖండ్లో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేందుకు పని దొరక్క, పని దొరికినా చాలీచాలని కూలీ ఇస్తుండటంతో కూలీలకు ఆవేదన మిగిలింది. జార్ఖండ్‌కు చెందిన ఒక దినసరి కూలీ వీడియో నెట్టింట వైరల్ అయింది. 15 రోజుల పాటు రోజుకు 8 గంటలు పనిచేసినప్పటికీ కేవలం 200 రూపాయలు మాత్రమే ఇచ్చారని ఒక మహిళా కూలీ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు నెటిజన్లు గుండెను బరువెక్కించాయి.

తనకు చిన్న పిల్లలు ఉన్నారని.. 200 రూపాయలు ఇస్తే తామేం తినాలని, పిల్లలను ఎలా పోషించాలని ఆమె కంటతడి పెట్టుకున్న హృదయవిదారక పరిస్థితి చూస్తే మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరి మనసు కన్నీటి సంద్రంగా మారుతుంది. ఆమె కంటి నుంచి వస్తు్న్న కన్నీళ్లు చూస్తే ఎంత కఠినాత్ముడి గుండైనా కరిగిపోతుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్మికుల దుర్భర పరిస్థితులపై ఈ వీడియో చర్చకు దారితీసింది.

చాలా మంది రోజువారీ కూలీల కష్టాలు, వారి పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తమైంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉండే కూలీలకు కనీస వేతనం కూడా ఇవ్వకపోవడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇలా బానిసలుగా మార్చుకుని పని చేయించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు పనికెళితే.. పురుషులకు రూ.500, మహిళలకు 400 రూపాయలకు తగ్గకుండా కూలీ ఇస్తున్న ఈరోజుల్లో మరీ దారుణంగా 15 రోజులు పనిచేయించుకుని 200 రూపాయలు కూలీ ఇవ్వడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

►ALSO READ | 5 వందల పింఛను కోసం.. మండుటెండలో.. అడవిలో.. అత్తను మోసుకుంటూ 9 కిలోమీటర్ల నడక !