విక్రమార్కుడు బేతాళ కథలు గుర్తుండే ఉంటాయి. ఈ కథలోని పట్టువదలని విక్రమార్కుడిలా.. ఛత్తీస్ గఢ్లో ఒక మహిళ తన అత్తను మోసుకుంటూ వెళ్లిన దయనీయ దృశ్యాలు సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేశాయి. 90 ఏళ్ల వయసు ఉన్న తన అత్తను ఆ మహిళ మోసుకుంటూ బ్యాంకు వరకూ వెళ్లింది.
A tribal woman from Chhattisgarh's Surguja carried her 90 year old mother-in-law on her shoulders and walked 5 km in the scorching heat to avail her pension money. pic.twitter.com/bUuRp3wo8x
— News Arena India (@NewsArenaIndia) May 23, 2026
ఎంతో వృద్ధి చెందామని చెప్పుకుంటున్న మన దేశంలో పింఛను పైసల కోసం బ్యాంకు వరకూ తన అత్తను మోసుకెళ్లిన ఒక మహిళ దీన పరిస్థితి ఇది. 90 ఏళ్ల అత్తగారి బరువు మోయలేక వంగిపోయి.. ఒక మహిళ మండుటెండలో.. అటవీ మార్గాలలో, రాళ్లురప్పల్లో, వాగులను దాటుకుంటూ నడిచింది.
ఈ ఘటన.. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో సంక్షేమ సదుపాయాల కోసం ప్రజలు పడుతున్న అవస్థలను కళ్లకు కట్టింది. సుర్గుజా జిల్లాలోని మైన్‌పట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. గ్రామీణ భారతంలో సంక్షేమ పథకాలు ప్రజల వరకూ చేరవని.. ప్రజలే సంక్షేమ పథకాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారని ఈ ఘటన రుజువు చేసిందని సోషల్ మీడియాలో అధికార యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తాయి.
►ALSO READ | కర్ణాటకలో ఘోరం: నదిలో ముత్యాల వేటకు వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి..
ఈ వీడియోలో తన అత్తను మోసుకెళుతున్న మహిళ పేరు సుఖ్మానియా బాయి. తన అత్త బ్యాంకు నుంచి పింఛను తీసుకోవడం కోసం, ఆమెను వీపుపై మోసుకుంటూ దాదాపు 9 కిలోమీటర్లు నడిచింది. ఈ అటవీ ప్రాంతంలో సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల.. ఊరు దాటి పట్టణానికి వెళ్లాలంటే అడవి గుండా, వాగులు వంకలు దాటి వెళ్లాల్సిన పరిస్థితి.
చదువుకోవడానికి వెళ్లాలన్నా.. ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లాలన్నా.. ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం వెళ్లాలన్నా.. ఇలా కాలినడకన లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లను మోసుకుంటూ వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
