కర్ణాటకలో ఘోరం: నదిలో ముత్యాల వేటకు వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి..

కర్ణాటకలో ఘోరం: నదిలో ముత్యాల వేటకు వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి..

కర్ణాటకలో ఘోరం జరిగింది. నది ముత్యాల వేటకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి చెందారు. ఆదివారం ( మే 24 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...కర్ణాటకలోని  భట్కల్ తాలూకాలోని శిరాలి గ్రామంలోని అల్వేకోడి సమీపంలో ఉన్న తట్టిహక్కలు కలినట్టి హోల్ దగ్గర, నదీగర్భం నుండి శంకురాళ్లను సేకరిస్తుండగా పది మంది నదిలో మునిగి చనిపోయారు.

మృతులను పడుశిరాలి బెంగ్రేకు చెందిన లక్ష్మీ మహదేవ్ నాయక్, ఉమేష్ నాయక్, లక్ష్మీ నాయక్, లక్ష్మీ అన్నప్ప నాయక్, లక్ష్మీ శివరాం నాయక్, జ్యోతి నాగప్ప నాయక్, మాలతీ నాయక్, మాస్తమ్మ నాయక్‌గా గుర్తించారు పోలీసులు. సుదీర్ఘ సెర్చ్ ఆపరేషన్ తర్వాత అల్వెకోడి ప్రాంతం నుండి అన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

నదిలో ముత్యాలు సేకరించడానికి వెళ్లిన 14 మంది బృందం వాగులోకి దిగి, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నీటిలో ముందుకు వెళ్తుండగా ఘటన జరిగిందని తెలిపారు పోలీసులు. అయితే, శనివారం ( మే 24 ) రాత్రి ఆ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం కారణంగా వాగులో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగిందని... అకస్మాత్తుగా పెరిగిన నీటిమట్టం, సమీపంలోని సముద్రం నుండి వస్తున్న బలమైన అలల తాకిడికి ఆ మృతులు కొట్టుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు.

►ALSO READ | 4 కిలోమీటర్ల దూరానికి 45 నిమిషాలు.. 'మా టాక్స్ డబ్బులు ఏమైపోతున్నాయి?'.. గూగుల్ ఉద్యోగి ఆవేదన!

ఈ ప్రమాదం నుండి నగరత్న, మహాదేవి అనే ఇద్దరు మహిళలు తృటిలో తప్పించుకున్నారని... వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైనవారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తుండగా... బాధితుల కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్న తీరు హృదయ విదారకంగా మారింది. భారీ వర్షాల సమయంలో నదులు, వాగులకు దూరంగా ఉండాలని... నీటిమట్టాలు అకస్మాత్తుగా పెరిగి నిమిషాల వ్యవధిలోనే అత్యంత ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరించారు అధికారులు.