జూన్ 04 నుంచి గ్రామ, వార్డు సభలు.. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’పై కలెక్టర్ల తో సీఎస్ రామకృష్ణారావు వీసీ

జూన్ 04 నుంచి గ్రామ, వార్డు సభలు.. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’పై  కలెక్టర్ల తో సీఎస్ రామకృష్ణారావు వీసీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ను క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. మంగళవారం సీఎస్ కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణ వార్డుల్లో విధిగా ‘గ్రామ సభలు’, ‘వార్డు సభలు’ నిర్వహించాలని ఆదేశించారు. 

ప్రభుత్వ పాలన, అభివృద్ధి, ప్రజా భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై పౌరుల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ సభలను ఒక సమర్థవంతమైన వేదికగా ఉపయోగించుకోవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సభల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల (ఐకేపీ) మహిళలు, కమ్యూనిటీ లీడర్లను చురుగ్గా భాగస్వాములను చేయాలని ఆదేశించారు.

సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రక్రియపై అవగాహన కల్పించండి

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సర్(ఓటర్ల జాబితాప్రత్యేక సవరణ)  ప్రక్రియపై ఈ సభల్లో ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని సీఎస్ రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఓటరు జాబితా ప్రక్షాళన ప్రాధాన్యతను, అర్హులైన వారంతా తమ పేర్లను నమోదు చేసుకునేలా విస్తృత ప్రచారం చేయాలని కోరారు.